CSK Vs GT IPL 2024: చెన్నై పై గుజరాత్ ఘన విజయం
కీలక మ్యాచ్లో చెన్నై పై గుజరాత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్నాా ఛేదించడంలో తడబడిన సీఎస్‌కే 20 ఓవర్లలో 196 పరుగులకే పరిమితమైంది.
CSK Vs GT IPL 2024: గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ పక్కా ప్రణాళికతో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ రెండిటిలోనూ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి బలమైన ప్రత్యర్థి చైన్నైపై అసాధ్యమనుకున్న విజయాన్ని సాధ్యం చేసి చూపించారు గుజరాత్ ప్లేయర్లు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సుదర్శన్‌లు సెంచరీలతో కదం తొక్కడడంతో మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో తడబడ్డ చెన్నై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులకు పరిమితమైంది. దీంతో గుజరాత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ కు ప్లే ఆఫ్స్కు కొద్ది పాటి అవకాశాలొచ్చాయి.
వాళ్లిద్దరి పోరాటమే..
తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు రచిన్ రవీంద్ర, అజింక్య రహానేతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో మిచెల్63(34), మోయిన్ అలీ56(36) ఇన్నింగ్స్‌ని ముందుక నడిపించే ప్రయత్నం చేశారు. వీళ్లిద్దర్నీ మోహిత్ శర్మ వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో చెన్నై ఇక కోలుకోలేదు. జడేజా, శివమ్ ధూబే కొంతసేపు మెరిపించినా.. త్వరగానే వాళ్లూ పెవిలియన్‌కి చేరారు. చివర్లో ఇక ఓటమి తప్పదని తేలిపోయాక.. ధోనీ మూడు సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించడం తప్ప చెన్నై ఇన్నింగ్స్‌లో చెప్పుకోవాల్సిందేమీలేదు.