Ambati Rayudu: రోహిత్ శర్మ హాట్ కేక్- అంబటి రాయుడు కీలక కామెంట్స్
Rohit Sharma : కెప్టెన్సీ మార్పు విషయంలో రోహిత్ శర్మతో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ సరిగ్గా వ్యవహరించ లేదని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు
Ambati Rayudu on Rohit Sharma and MI controversy: ఏ ముహూర్తాన ముంబై (MI)కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా(Hardic Pandya) బాధ్యతలు చేపట్టాడో కానీ అప్పటి నుంచి పాండ్యాపై విమర్శల జడివాన కురుస్తోంది. IPL 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్‌శర్మ(Rohit Sharma)ను తప్పించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రోహిత్- హార్దిక్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. IPL 2024 చివరిలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడుతాడన్న ప్రచారం జరుగుతోంది. ముంబైని 5 సార్లు ఐపిఎల్ ఛాంపియన్‌గా చేసిన రోహిత్ శర్మ 2025 ఐపీఎల్ మెగా వేలంలో వేలానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఊహాగానాలపై ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు..
అంబటి రాయుడు ఏమన్నాడంటే..?
కెప్టెన్సీ మార్పు విషయంలో రోహిత్ శర్మతో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ సరిగ్గా వ్యవహరించ లేదని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో వేలానికి హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటే.. అతడిని ఏ ప్రాంఛైజీ అయినా భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంటుందని రాయుడు అన్నాడు. అతను ఏ ప్రాంఛైజీకి కావాలంటే ఆ ప్రాంఛైజీకి వెళ్లవచ్చని... అన్ని IPL జట్లు రోహిత్‌ను కెప్టెన్‌గా చేయడానికి రెడీగా ఉంటాయని అంబటి తెలిపాడు. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వ్యవహరించిన దాని కంటే మిగిలిన ప్రాంఛైజీలు రోహిత్‌తో చాలా మెరుగ్గా వ్యవహరిస్తాయని కూడా అంబటి రాయుడు తెలిపాడు.
లాంగర్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్(MI) స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి..లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్(LSG coach Justin Langer)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని విడిచిపెడితే.. అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని లాంగర్ ప్రకటించాడు. ఈ ప్రకటనతో లాంగర్ హిట్ మ్యాన్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. IPL 2025 మెగా వేలంలో ఆటగాళ్లందరూ వేలానికి అందుబాటులో ఉంటే... మీ జట్టులోకి ఎవరిని తీసుకుంటారన్న ప్రశ్న జస్టిన్ లాంగర్‌కు ఎదురైంది. దీనికి లాంగర్ స్పందించాడు. రోహిత్ శర్మతో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. తాను రోహిత్ శర్మను తమ జట్టులోకి తీసుకొని అతనితో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు లాంగర్ తెలిపాడు. రోహిత్‌ను ముంబై ఇండియన్స్ నుంచి తమ జట్టులోకి తీసుకొస్తామని వెల్లడించాడు. కానీ ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ వదిలేస్తాడని తాను అనుకోవట్లేదని లాంగర్ అన్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ విలువ తనకు బాగా తెలుసని లాంగర్ చెప్పాడు. రోహిత్ భారీ సిక్సర్లను అవలోకగా కొట్టగలడని... హిట్‌మ్యాన్ ప్రపంచ స్థాయి కెప్టెన్ అని గుర్తు చేశాడు.