SRH Vs PBKS, Match Highlights: సన్‌రైజర్స్ ఇంటికే.. ఐదు పరుగులతో పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ!
IPL 2021, SRH vs PBKS: ఐపీఎల్‌లో నేడు సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదు పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది.
ఐపీఎల్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై పంజాబ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. మార్క్రమ్ (27: 32 బంతుల్లో, 2 ఫోర్లు) మినహా ఎవరూ 20 పరుగులు కూడా చేయలేకపోవడంతో.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి.. 125 పరుగులు మాత్రమే చేసింది. రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రైజర్స్ మొదట్లోనే కీలక వికెట్లు కోల్పోయింది. మనీష్ పాండే, సాహా నత్తనడకన ఇన్నింగ్స్ నడిపించడంతో సాధించాల్సిన రన్‌రేట్ కొండలా పెరిగిపోయింది. వీరు అవుటయ్యాక జేసన్ హోల్డర్ చివర్లో ఆసక్తి రేకెత్తించినా.. గెలుపు తన సత్తా సరిపోలేదు. దీంతో రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లు రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం అయ్యారు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ అధికారికంగా ఇంటి బాట పట్టింది. పంజాబ్ ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.
అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్ బౌలర్లు
టాస్ ఓడిపోయి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే ఓపెనర్లయిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇద్దరినీ అవుట్ చేసి హోల్డర్ సన్‌రైజర్స్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన గేల్, మార్క్రమ్ కూడా చాలా నిదానంగా బ్యాటింగ్ చేశారు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి రెండు వికెట్లు నష్టపోయి 29 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత కూడా సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లకు స్కోరు 55 పరుగులకు చేసింది.
ఆ తర్వాత పంజాబ్‌కు వరస షాకులు తగిలాయి. క్రిస్ గేల్ (14: 16 బంతుల్లో, ఒక ఫోర్), నికోలస్ పూరన్‌లు(8: 4 బంతుల్లో, ఒక సిక్సర్) వరస ఓవర్లలో అవుటయ్యారు. క్రీజులో ఉన్నంత సేపూ ఇబ్బంది పడ్డ మార్క్రమ్‌ను (27: 32 బంతుల్లో, 2 ఫోర్లు) సమద్ అవుట్ చేయగా, అప్పుడే భారీ షాట్లు ఆడుతున్న ఆడుతున్న హుడాను (13: 10 బంతుల్లో, ఒక ఫోర్) సుచిత్ అద్భుతమైన క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. దీంతో పంజాబ్ 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన నాథన్ ఎల్లిస్(12: 12 బంతుల్లో, ఒక సిక్సర్), హర్‌ప్రీత్ బ్రార్(18 నాటౌట్: 18 బంతుల్లో, ఒక ఫోర్) సింగిల్స్, డబుల్స్ తప్ప భారీ షాట్లు కొట్టలేకపోయారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 125 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ మూడు వికెట్లు తీసుకోగా.. సమద్, రషీద్, భువీ, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు.
Also Read: దిల్లీదే రాజసం.. ప్లేఆఫ్స్‌కు పంత్ సేన: రాజస్థాన్ చిత్తు
రైజర్స్‌దీ అదే దారి..
రైజర్స్ ఇన్నింగ్స్ కూడా అత్యంత పేలవంగా ప్రారంభం అయింది. మొదటి ఓవర్లో డేవిడ్ వార్నర్ (2: 3 బంతుల్లో), మూడో ఓవర్లో కేన్ విలియమ్సన్‌లను (1: 5 బంతుల్లో) అవుట్ చేసి.. షమీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 10 పరుగులు మాత్రమే. ఆ తర్వాత మనీష్ పాండే (13: 23 బంతుల్లో, ఒక ఫోర్), వృద్ధిమాన్ సాహా కాస్త నిదానంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 2 వికెట్లు కోల్పోయి 20 పరుగుల మాత్రమే. ఐపీఎల్ చరిత్రలోనే ఇది సన్‌రైజర్స్‌కు పవర్‌ప్లేలో అత్యంత తక్కువ స్కోరు. తర్వాత మనీష్ పాండేను క్లీన్ బౌల్డ్ చేసి రవి బిష్ణోయ్ పంజాబ్‌కు మూడో వికెట్ అందించాడు. తర్వాత కూడా ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. 10 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 43 పరుగులు మాత్రమే రైజర్స్ చేయగలిగారు.
ఆ తర్వాత రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. కేదార్ జాదవ్ (12: 12 బంతుల్లో), సమద్(1: 2 బంతుల్లో)లను ఒకే ఓవర్లో అవుట్ చేసి రవి బిష్ణోయ్ మళ్లీ పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత సమన్వయ లోపం కారణంగా సాహా కూడా రనౌటయ్యాడు. అనంతరం జేసన్ హోల్డర్ (47 నాటౌట్: 29 బంతుల్లో, ఐదు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో గెలుపుపై రైజర్స్‌కు ఆశలు రేగాయి. అయితే హోల్డర్‌కు మరోవైపు సపోర్ట్ లేకపోవడంతో చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉండగా, ఒక సిక్సర్‌తో కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివరి బంతికి సిక్సర్ కొడితే మ్యాచ్ టై అయ్యే దశలో భారీ షాట్‌కు ప్రయత్నించినా.. ఆ షాట్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఐదు పరుగులతో పంజాబ్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా, షమీ రెండు, అర్ష్‌దీప్ ఒక వికెట్ తీశారు.
Also Read: టీమిండియా బాటలో శ్రీలంక జట్టు.. ధోనీకి పోటీగా బరిలోకి మహేళ జయవర్దనే
Also Read: రద్దయిన టెస్టు మళ్లీ జరిగే అవకాశం.. ఎప్పుడంటే?