(Source: ECI/ABP News/ABP Majha)
Mirabai Chanu: బరిలోకి దిగుతుంది గానీ బరువులెత్తదు - మీరాబాయి సంచలన నిర్ణయం
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన స్టార్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను త్వరలో జరుగబోయే వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలో నిలిచినా బరువులెత్తకూడదని డిసైడ్ అయింది.
Mirabai Chanu: భారత అగ్రశ్రేణి వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి రియాద్ (సౌదీ అరేబియా) వేదికగా జరుగనున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ - 2023 లో ఆమె ప్రత్యక్ష పోటీలకు దూరంగా ఉండనుంది. ఆసియా క్రీడల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన చాను.. ప్రధానంగా ఆసియా క్రీడల మీదే దృష్టి సారించింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ను నామ్ కే వాస్తేగా పాల్గొననుంది.
వచ్చే ఏడాది జరుగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడం తప్పనిసరి చేయడంతో మీరాబాయి ఈ పోటీలలో లాంఛనాలను పూర్తిచేయడానికి మాత్రమే రియాద్‌కు వెళ్లనుంది. రియాద్‌కు వెళ్లి అక్కడ పోటీకి ముందస్తు లాంఛనాలు పూర్తి చేయడమే గాక అవసరమైతే డోప్ పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చేందుకు కూడా ఆమె సిద్ధమైంది. అయితే ఆమె మాత్రం పోటీలో పాల్గొనదు. బరువులు ఎత్తదు..
Indian female weightlifter Mirabai Chanu set her sights firmly on an elusive medal at Hangzhou Asian Games, she will not lift any weight at next week's World Championship.#Hangzhou #AsianGames #Weightlifting #TeamIndia #HangzhouAsianGames @WeAreTeamIndia pic.twitter.com/j2ME1iRyRp
— 19th Asian Games Hangzhou 2022 Official (@19thAGofficial) August 30, 2023
వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ సెప్టెంబర్ 4న మొదలుకావాల్సి ఉంది. అయితే ఆసియా క్రీడలు కూడా సెప్టెంబర్ 23 నుంచే హాంగ్జౌ (చైనా)లో మొదలుకానున్నాయి. ఈ రెండింటికీ మధ్య తేడా 20 రోజులు కూడా లేకపోవడంతో మీరా ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం మీద గురిపెట్టిన చాను.. ప్రస్తుతం అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఆరోన్ హోర్ష్చిగ్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందుతున్నది. ఆసియా క్రీడలకు ముందు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో బరువులు ఎత్తే క్రమంలో ఏదైనా గాయమైతే అది మొదటికే మోసం రానుంది. అందుకే ఈ పోటీలకు దూరంగా ఉండాలని మీరా భావిస్తున్నది. 2017 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో మీరాబాయి స్వర్ణం నెగ్గింది.
ఇదే విషయమై ఆమె చీఫ్ కోచ్ విజయ్ శర్మ మాట్లాడుతూ.. ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ఆసియా గేమ్స్ మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంది. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం తప్పనిసరి కావడంతో ఆమె రియాద్‌కు వెళ్లి లాంఛనాలను పూర్తి చేస్తుంది. డోప్ పరీక్షలకూ శాంపిల్స్ ఇస్తుంది. కానీ పోటీలో మాత్రం పాల్గొనదు. జస్ట్ అటెండెన్స్ కోసమే అక్కడికి వెళ్లనుంది..’ అని తెలిపాడు. గతేడాది బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన చాను.. ఆసియా క్రీడల్లో కూడా అదే ప్రదర్శనను రిపీట్ చేయాలని భావిస్తున్నది. మరి మీరాబాయి తీసుకున్న తాజా నిర్ణయంతో ఆమె ఆసియా క్రీడల్లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial