NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్
భారత అభిమానుల ఆశలు అడియాసలే అయ్యాయి. అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. కేన్ విలియమ్సన్ ఆఖరి వరకు నిలిచి జట్టును సెమీస్‌కు చేర్చాడు.
అయిపాయె..! అటు అఫ్గానిస్థాన్‌కు ఇటు టీమ్‌ఇండియాకు అదృష్టం కలిసిరాలేదు! ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకే మ్యాచులో అఫ్గాన్, ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. పఠాన్లతో జరిగిన పోరులో న్యూజిలాండ్ సునాయాస విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40; 42 బంతుల్లో 3x4, 0x6), డేవాన్ కాన్వే (36; 32 బంతుల్లో 3x4, 0x6) అదరగొట్టారు. అంతకు ముందు అఫ్గాన్‌లో నజీబుల్లా జద్రాన్ (73; 48 బంతుల్లో 6x4, 3x6) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
ఒక్కో పరుగూ చేస్తూ
పిచ్ కష్టంగా ఉండటం అఫ్గాన్‌లో చక్కని స్పిన్నర్లు ఉండటంతో కివీస్ లక్ష్య ఛేదన కఠినంగా సాగుతుందేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. న్యూజిలాండ్ బ్యాటర్లు ఒక్కో ఇటుక పేర్చినట్టుగా ఒక్కో పరుగు జోడిస్తూ ముందుకు సాగారు. స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కొని పరుగులు చేశారు. సమీకరణాన్ని బంతికో పరుగు చొప్పునే ఉంచుకున్నారు. ఎక్కడా రిస్క్ తీసుకోలేదు. దాంతో కివీస్ పవర్‌ప్లేలో కేవలం 45 పరుగులు చేసి కేవలం డరైల్ మిచెల్ (17: 12 బంతుల్లో 3x4) వికెట్ మాత్రమే కోల్పోయింది. అతడిని ముజీబ్ ఔట్ చేశాడు.
కేన్, కాన్వే అదుర్స్
చక్కగా ఆడుతున్న మార్టిన్ గప్తిల్ (28: 23 బంతుల్లో 4x4) రషీద్ గూగ్లీని అర్థంచేసుకోలేక బౌల్డ్ అయ్యాడు. అప్పటికి స్కోరు 57. ఇక వికెట్ల పతనం మొదలవుతుందేమో అనుకుంటే.. విలియమ్సన్, కాన్వే తెలివిగా ఆడారు. మూడో వికెట్‌కు 56 బంతుల్లోనే 68 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వీలు కుదిరిన ప్రతిసారీ ఈ జోడీ బౌండరీలు బాదేసింది. మరో 11 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో విజయం అందించింది. ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి చేరుకొని కివీస్ సెమీస్‌కు చేరుకుంది.
జద్రాన్ జబర్దస్త్
అఫ్గాన్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కానీ భారీ లక్ష్యం నిర్దేశించాలన్న వారి ఆశలు నెరవేరలేదు! పవర్‌ప్లేలో 3 వికెట్లు నష్టపోయి 23 పరుగులే చేసింది. హజ్రతుల్లా జజాయ్ (2), మహ్మద్ షెజాద్ (4), రెహ్మనుల్లా గుర్బాజ్ (6) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ క్రమంలో గుల్బదిన్ నయీబ్‌తో కలిసి నజీబుల్లా జద్రాన్ అద్భుతం చేశాడు. కివీస్ పేసర్లు, స్పిన్నర్లను ఆచితూచి ఆడాడు. ఒకట్రెండు బౌండరీలు బాదేసి ఆత్మవిశ్వాసం అందుకున్న జద్రాన్ ఆ తర్వాత ఆగలేదు. 33 బంతుల్లోనే 50 పరుగులు చేసేశాడు. జట్టు స్కోరు 56 వద్ద నయీబ్ ఔటైనా కెప్టెన్ నబీ సాయంతో జద్రాన్ రెచ్చిపోయాడు. జట్టు స్కోరు 100 దాటించాడు. ఆఖర్లో స్కోరు పెంచే క్రమంలో అతడిని బౌల్ట్ పెవిలియన్ పంపించాడు. ఆఖరి ఓవర్‌ను నీషమ్ అద్భుతంగా వేయడంతో కివీస్ 124/8కి పరిమితం అయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Booking a place in the @T20WorldCup finals! Kane Williamson 40* and Devon Conway 36* finish things off against Afghanistan in Abu Dhabi. | https://t.co/5hlORtSdCL #T20WorldCup pic.twitter.com/rJjAR4ZCfX
— BLACKCAPS (@BLACKCAPS) November 7, 2021
New Zealand are into the semis 👏#T20WorldCup | #NZvAFG | https://t.co/paShoZpj88 pic.twitter.com/PRo6Ulw4Dk
— T20 World Cup (@T20WorldCup) November 7, 2021