Ashes Series 2023: గొప్ప మైలురాళ్లకు చేరువలో బ్రాడ్, అండర్సన్ - ఈ యాషెస్ సిరీస్‌లోనే!
యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో కొత్త మైలు రాళ్లు చేరుకునే అవకాశం ఉంది.
Ashes Series 2023 England vs Australia, 1st Test: యాషెస్ సిరీస్ 2023 ప్రారంభమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ప్రత్యేక రికార్డును సాధించగలరు. అండర్సన్‌కు 700 టెస్టు వికెట్లు పూర్తి చేసే అవకాశం ఉంది. అలాగే స్టువర్ట్ బ్రాడ్ 600 వికెట్లు కూడా పూర్తి చేయగలడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఈ ఇద్దరూ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జేమ్స్ అండర్సన్. ఇప్పటి వరకు ఆడిన 333 ఇన్నింగ్స్‌ల్లో 685 వికెట్లు తీశాడు. 700 వికెట్లు పూర్తి చేసేందుకు అండర్సన్‌కు కేవలం 15 వికెట్లు మాత్రమే అవసరం. ఈసారి యాషెస్ సిరీస్‌లో ఈ మైలురాయిని దాటే అవకాశం ఉంది. అండర్సన్ తన కెరీర్‌లో 32 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. మూడు సార్లు ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు కూడా తీశాడు.
ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 299 ఇన్నింగ్స్‌లలో 582 వికెట్లు తీశాడు. స్టువర్ట్ బ్రాడ్‌కి 600 వికెట్లు పూర్తి చేయడానికి 18 వికెట్లు అవసరం. ఈ ఫార్మాట్‌లో 15 పరుగులకు 8 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఇక టెస్టు మ్యాచ్ గురించి చెప్పాలంటే అతను ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫార్మాట్‌లో బ్రాడ్ 20 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఒక మ్యాచ్‌లో మూడు సార్లు 10 వికెట్లు కూడా తీశాడు.
ఈసారి యాషెస్ సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 16వ తేదీ నుంచి జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ జూన్ 28వ తేదీ నుంచి లండన్‌లోని లార్డ్స్‌లో, మూడో మ్యాచ్ జూలై 6వ తేదీ నుంచి లీడ్స్‌లో, నాలుగో మ్యాచ్ జూలై 19వ తేదీ నుంచి మాంచెస్టర్‌లో, ఐదో, చివరి టెస్టు జూలై 27వ తేదీ నుంచి లండన్‌లోని ఓవల్‌లో జరగనున్నాయి.
నేటి మ్యాచ్‌లో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ను దురదృష్టం వెంటాడింది. ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ ఔట్, రనౌట్ వంటివాటితో పాటు నేరుగా బౌల్డ్ కాకపోయినా అతడు నిష్క్రమించాల్సి వచ్చింది.
అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది అన్న చందంగా తయారైంది తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్ పరిస్థితి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్.. 37 బంతుల్లోనే 4 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. స్పిన్ ఆడటంలో ఇబ్బందులు పడే బ్రూక్ బలహీనతను పసిగట్టిన ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్.. పదే పదే బ్రూక్‌కు నాథన్ లియన్‌తోనే ఎక్కువ ఓవర్లు వేయించాడు.
ఈ క్రమంలో 38వ ఓవర్ వేసిన లియాన్ రెండో బంతిని ఆఫ్ బ్రేక్ గా సంధించాడు. బంతి పిచ్‌కు తాకి ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చి బ్రూక్ లెఫ్ట్ థై ప్యాడ్‌కు తాకి అక్కడే గాల్లోకి లేచింది. అయితే బంతి ఎటు వైపు ఉందో అర్థం కాక బ్రూక్‌తో పాటు వికెట్ కీపర్ అలెక్స్ కేరీ, స్లిప్ ఫీల్డర్స్ అటూ ఇటూ చూస్తుండగానే బంతి పైనుంచి వచ్చి బ్రూక్ నడుముకు తాకి అక్కడే కిందపడి రెండో స్టెప్ లో బెయిల్స్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్ నిరాశగా వెనుదిరిగాడు.