WTC Final: ఓవల్ సీక్రెట్ ప్యాటర్న్ అదే - రన్స్ కొట్టే టెక్నిక్ చెప్పిన హిట్‌మ్యాన్!
WTC Final: ఇంగ్లాండ్‌లో వాతావరణం భిన్నంగా ఉంటుందని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. ఎంతసేపు ఆడినా అక్కడ నిలదొక్కుకున్నట్టు బ్యాటర్‌కు అనిపించదని పేర్కొన్నాడు.
WTC Final 2023:
ఇంగ్లాండ్‌లో వాతావరణం భిన్నంగా ఉంటుందని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంటున్నాడు. ఎంతసేపు ఆడినా అక్కడ నిలదొక్కుకున్నట్టు బ్యాటర్‌కు అనిపించదని పేర్కొన్నాడు. అయితే అటాకింగ్ సెన్స్ మాత్రం తెలుస్తుందని వెల్లడించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎలా సన్నద్ధమయ్యాడో వివరించాడు.
జూన్ 7 నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final 2023) మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) ఈ పోరులో తలపడుతున్నాయి. ప్రతిష్ఠాత్మక మ్యాచులో గెలిచి 'టెస్టు గద'ను సొంతం చేసుకోవాలని రెండు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా లండన్‌కు చేరుకొన్నారు. ఓవల్ మైదానంలో ప్రతి రోజూ సాధన చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నారు. రోహిత్ శర్మ 2021లో ఓవల్ మైదానంలో విదేశాల్లో తొలి టెస్టు సెంచరీ అందుకున్నాడు. ఫైనల్ సైతం అక్కడే జరుగుతుండటంతో అతడిపై అంచనాలు పెరిగాయి.
'ఇంగ్లాండ్ కండీషన్స్ బ్యాటర్లకు సవాల్‌గా మారతాయి. అక్కడి వాతావరణానికి అలవాటు పడితే, కఠినంగా సాధన చేస్తే బ్యాటర్లు కచ్చితంగా రాణించగలరు. 2021లో ఓవల్‌లో ఆడినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. వాతావరణం గంట గంటకూ మారుతుండటంతో క్రీజులో నిలదొక్కుకున్నట్టే అనిపించదు. సుదీర్ఘ సమయం ఏకాగ్రతతో ఆడాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి సమయంలో బౌలర్లను అటాక్ చేయాలో మనసు మనకు చెప్తుంది' అని రోహిత్ శర్మ అన్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ గెలిచేందుకు టీమ్‌ఇండియా డేటా అనలిస్టులను నియమించుకుంది. కొన్నేళ్లుగా టీమ్‌ఇండియా, ముంబయి ఇండియన్స్‌కు పనిచేస్తున్న అనలిస్టును తీసుకున్నారు. ఇంతకు ముందు ఓవల్‌లో విజయవంతమైన బ్యాటర్లు ఎలాంటి ప్యాటర్న్ అనుసరించారో తెలుసుకోవడం ఉపయోగపడుతుందని హిట్‌మ్యాన్ అంటున్నాడు.
'ఇంగ్లాండ్‌లో విజయవంతమైన మాజీ ఆటగాళ్లను నేనేమీ అనుసరించను. అయితే వారు పరుగులు చేసిన విధానాన్ని తెలుసుకోవడం మంచిది. నేను గమనించింది ఏంటంటే..! ఓవల్ మైదానంలో స్క్వేర్ బౌండరీలు వేగంగా ఉంటాయి' అని రోహిత్ శర్మ తెలిపాడు. ఒక ఫార్మాట్ నుంచి మరో దానికి వేగంగా మారడం సులభమేమీ కాదని అతడు పేర్కొన్నాడు. ఇందుకోసం తన టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసుకున్నట్టు వివరించాడు.
'వెంటవెంటనే ఫార్మాట్లు మారడం సవాలే. ఇప్పుడు అందరూ వేర్వేరు ఫార్మాట్లు ఆడుతున్నారు. అందుకే మానసికంగా మార్పుకు వేగంగా అలవాటు పడాలి. ఫార్మాట్‌కు అనుగుణంగా టెక్నిక్‌ను మార్చుకోవాలి. ప్రతి క్షణం మనతో మనమే మాట్లాడుకోవాలి. మెంటల్‌గా రెడీ అవ్వాలి. చాలామంది యువకులు ఈపని చేయడం లేదు. మాలో కొందరం కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం. అత్యుత్తమ ప్రదర్శనలు బయట పెడుతున్నాం' అని రోహిత్ వెల్లడించాడు.
Also Read: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే
'క్రికెట్లో టెస్టులే అల్టిమేట్! ఈ మ్యాచులు సవాల్ విసురుతాయి. కఠిన పరిస్థితులను ఎదుర్కోవాలి. ఒక వ్యక్తిగా నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు అత్యుత్తమ ఆటతీరు బయటకు వస్తుంది. మూడు నాలుగేళ్లుగా మేం మంచి టెస్టు క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడు ఆఖరి సవాల్‌ను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చేసింది. యువకులు మెరుగ్గా ఆడేలా ఆత్మవిశ్వాసం అందించడం కీలకం' అని హిట్‌మ్యాన్ చెప్పాడు.