World Cup 2023: పాక్ ఇలా అయితే సెమీస్ చేరొచ్చు, వసీం అక్రమ్ "టైమ్డ్ అవుట్" సలహా
ODI World Cup 2023: సెమీస్ చేరాలంటే అదిరిపోయే సలహా ఇచ్చాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అది ఏంటంటే..
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలన్న పాకిస్థాన్ ఆశలపై న్యూజిలాండ్ దాదాపుగా నీళ్లు పోసింది. శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో పాక్ సెమీస్ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. శ్రీలంకపై కివీస్ 160 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి పాకిస్థాన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఒకవేళ ఇప్పటికీ పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే మహాద్భుతమే జరగాలి. ఆ అద్భుతం ఏంటంటే పాకిస్థాన్.. ఇంగ్లండ్ మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయం నమోదు చేయాలి. ఇది అసాధ్యం కావడంతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ పాక్ జట్టుకు అదిరిపోయే సలహా ఇచ్చాడు. దీనికి కొనసాగింపుగా మరో మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ కూడా వంతపాడాడు. ఇంతకీ వసీం అక్రమ్ ఇచ్చిన సలహా ఏంటంటే..
ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని వసీం అక్రమ్ సూచించాడు. స్కోరు బోర్డుపై లక్ష్యాన్ని నిర్దేశించాలని సూచించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు రాకుండా ఆ జట్టు సభ్యులందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండగానే బయట గొళ్లెం పెట్టి తాళం వేయాలని వసీం అక్రమ్ సూచించాడు. ఆ తర్వాత పాక్ జట్టు గ్రౌండ్‌లోకి వెళ్లాలని అన్నాడు. అప్పుడు ఇంగ్లండ్ జట్టంతా 20 నిమిషాల్లో టైమ్డ్ ఔట్ అవుటవుతుందని అలా భారీ తేడాతో పాక్ గెలుస్తుందని వసీం అక్రమ్ సూచించాడు. దీనిపై అక్కడే ఉన్న పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ స్పందించాడు. తొలుత మనం బ్యాటింగ్ చేసి కష్టపడటం ఎందుకు అని ప్రశ్నించిన మిస్బా తన వద్ద ఇంకా అదిరిపోయే ఆలోచన ఉందని తెలిపాడు. తొలుత ఇంగ్లండ్‌కే బ్యాటింగ్ అప్పగించి.. వారు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండగానే తాళం పెట్టేస్తే సరిపోతుందన్నాడు. ఆ తర్వాత పాక్ ఒక పరుగు చేస్తే గెలిచేస్తామని మిస్బా అనడంతో అంతా నవ్వేశారు.
వసీం, మిస్బా సరదాగా ఈ వ్యాఖ్యలు చేసినా పాక్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కష్టాల్లో ఉన్న జట్టుకు అండగా ఉండాల్సిన దిగ్గజ ఆటగాళ్లు ఇలా మాట్లాడడంపై భగ్గుమంటున్నారు. గత రెండు మ్యాచుల్లోపాక్ అద్భుతంగా పుంజుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్లిష్ట సమయంలో జట్టుకు అండగా నిలవాల్సిన దిగ్గజ ఆటగాళ్లే ఇలా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఆ అద్భుతం ఏంటంటే పాకిస్థాన్.. ఇంగ్లండ్ మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత పాక్ బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో భారీ విజయం సాధించాలి. అంటే పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌ను 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. అలా కాకుండా పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 284 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. అంటే ఇంగ్లండ్ 100 పరుగులకే ఆలౌటైనా... ఆ వంద పరుగులను పాకిస్థాన్ 16 బంతుల్లోనే సాధించాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవ్వరికీ సాధించని గణాంకాలతో పాక్ విజయం సాధించాలి. కానీ ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎంత బలహీనంగా ఉన్న అంత ఘోరంగా ఓడిపోతుందని ఊహించడం కష్టమే. అందుకే ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాకిస్థాన్ ఇప్పటివరకూ చేయని అద్భుతమే చేయాలి.