World Cup 2023: వన్డే ప్రపంచకప్ - ఆసీస్‌తో టీమ్‌ఇండియా ఫస్ట్ మ్యాచ్! వేదిక ఇదే!
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూలు దాదాపుగా ఖరారైంది. వేదికలనూ ఎంపిక చేశారని తెలిసింది. ఈ మెగా టోర్నీ ఆరంభ, ఆఖరి మ్యాచులు అహ్మదాబాద్‌లోని మొతేరాలో నిర్వహించనున్నారు.
World Cup 2023:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూలు దాదాపుగా ఖరారైంది. వేదికలనూ ఎంపిక చేశారని తెలిసింది. ఈ మెగా టోర్నీ ఆరంభ, ఆఖరి మ్యాచులు అహ్మదాబాద్‌లోని మొతేరాలో నిర్వహించనున్నారు. అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మొదటి మ్యాచులో తలపడతాయని సమాచారం. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
ఈ వన్డే ప్రపంచకప్‌లో (ICC ODI World Cup 2023) టీమ్‌ఇండియా మొదట ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఉంటుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15, ఆదివారం జరగనుందని తెలిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ముగియగానే బీసీసీఐ (BCCI) షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం అన్ని దేశాల నుంచి సూచన ప్రాయంగా అంగీకారం పొందనుంది. ఇక తేదీలు, వేదికలపై తుది నిర్ణయం బీసీసీఐదే ఉంటుందని తెలిసింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్టు క్రిక్‌బజ్ రిపోర్టు చేసింది. ఆసియాకప్ (Asia Cup 2023) ఆడటంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. అయితే భారత్‌లో ఆడేందుకు కొన్ని ఆందోళనలు ఉన్నట్టు పీసీబీ (PCB) చెబుతోంది. పరిష్కారం కోసం ఐసీసీని సంప్రదించినట్టు తెలిసింది.
గుజరాత్ వాణిజ్య పట్టణం అహ్మదాబాద్‌లో ఆడేందుకు పీసీబీ అభ్యంతరం చెబుతోంది. అందుకోసమే నజమ్ సేథీ ఐసీసీ గడప తొక్కారని తెలిసింది. భద్రత కోసం తమ మ్యాచుల వేదికల్లో మార్పు చేయాలని కోరినట్టు సమాచారం. అయితే పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్‌ను మాత్రం అహ్మదాబాద్‌లో ఆడేందుకు అంగీకరించిందట!
ఇప్పటికి కుదిరిన ఏకాభిప్రాయం మేరకు అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పాకిస్థాన్ మ్యాచులను ఆడనుంది. దాయాది ఆడే ఎక్కువ మ్యాచులకు దక్షిణాది వేదికలనే ఎక్కువగా కేటాయించారు. అందులో ఎక్కువ మ్యాచులను చెన్నైలో ఆడనుంది. ఎలాంటి గొడవలు, ఇబ్బందులు రాకుండా అక్కడ ప్రశాంతంగా ఉంటుందని పాక్ భావిస్తోంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ఇండోర్, ధర్మశాల, గువాహటి, రాజ్‌కోట్, రాయ్‌పుర్, ముంబయిని వేదికలుగా నిర్ణయించారు. మొహాలి, నాగ్‌పుర్‌కు మ్యాచులు కేటాయించలేదని తెలిసింది. ఒక సెమీ ఫైనల్ మ్యాచును వాంఖడేలో నిర్వహిస్తారు. మరో సెమీస్‌కు చెన్నై లేదా అహ్మదాబాద్‌నే ఎంపిక చేస్తారని సమాచారం.
మొత్తం ఈ టోర్నీలో 10 జట్లు 48 మ్యాచులు ఆడతాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మొత్తం 9 మ్యాచులు ఆడుతుంది. అంటే ప్రతి జట్టుతో ఒక మ్యాచ్ ఉంటుంది. దాదాపుగా ప్రతి వేదికలో టీమ్‌ఇండియా ఒక మ్యాచ్ ఆడేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికైతే భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. దక్షిణాఫ్రికా తాజాగా జాబితాలో చేరింది.
జూన్-జులైలో జింబాబ్వేలో అర్హత టోర్నీ ఉంటుంది. వెస్టిండీస్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, నేపాల్, ఒమన్, స్కాట్లాండ్, యూఏఈ, జింబాబ్వే పోటీ పడతాయి. ఇందులో రెండు జట్లు వన్డే ప్రపంచకప్‌కు ఎంపికవుతాయి.
The road to @cricketworldcup 2023 is set 🏆 pic.twitter.com/HSqHwMLqCn
— ICC Cricket World Cup (@cricketworldcup) May 10, 2023