Women's T20 Asia Cup Squad: మహిళల ఆసియా కప్, భారత అమ్మాయిల జట్టు ఇదే
Women's T20 Asia Cup Squad: అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్ లో జరగనున్న మహిళల ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది.
Women's T20 Asia Cup Squad: అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్ లో జరగనున్న మహిళల ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. గాయపడి కోలుకున్న స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకుంది. నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ తో జరిగిన ఉమెన్స్ హండ్రెడ్ మ్యాచ్ సమయంలో జెమీమా మణికట్టుకు గాయమైంది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైంది. అప్పట్నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మూడు వారాల పునరావాసం పొంది కోలుకుంది. ఇప్పుడు ఆసియా కప్ కు చోటు దక్కించుకుంది.
వికెట్ కీపర్ గా రిచా ఘోష్
ఇంగ్లండ్ తో సిరీస్ లో లోయరార్డర్ లో హిట్టింగ్ తో ఆకట్టుకున్న రిచా ఘోష్.. ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్ గా తన స్థానాన్ని నిలుపుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లో ప్రధాన వికెట్ కీపర్ గా ఉన్న తానియా భాటియా.. ఇంగ్లండ్ సిరీస్ లో రాణించలేదు. దాంతో ఆమెను స్టాండ్ బై గా తీసుకున్నారు. మీడియం పేసర్ సిమ్రన్ బహదూర్ కూడా స్టాండ్ బై లో చోటు సంపాదించింది. ప్రధాన ఫాస్ట్ బౌలర్లుగా మేఘనా సింగ్, రేణుకా సింగ్.. మూడో సీమర్ గా ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్లను తీసుకున్నారు. ఎడమచేతి వాటం స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్, రాధాయాదవ్.. కుడిచేతి వాటం ఆల్ రౌండర్లు స్నేహ్ రాణా, దీప్తి శర్మలు జట్టులో ఉన్నారు.
రౌండ్ రాబిన్ పద్ధతి
నాలుగేళ్ల విరామం తర్వాత మహిళల ఆసియా కప్ ను తిరిగి నిర్వహిస్తున్నారు. 7 జట్లతో కూడిన ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది, లీగ్ దశలో ప్రతి జట్టు 6 మ్యాచ్‌లు ఆడుతుంది, మొదటి 4 జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి.
శ్రీలంకతో మొదటి మ్యాచ్
అక్టోబర్ 1 న భారత్- శ్రీలంకతో తలపడనుంది. ఆ తర్వాత వరుసగా మలేషియా, యూఏఈ, పాకిస్థాన్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్ లతో లీగ్ దశ మ్యాచులు ఆడతారు. ఈ మ్యాచులన్నీ సిల్హెట్ మైదానంలో జరుగుతాయి. ఇక్కడ టీమిండియా చివరిసారిగా 2014 టీ20 ప్రపంచకప్ లో ఆడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. 2018లో కౌలాలంపూర్ లో జరిగిన ఫైనల్ లో ఆ జట్టు భారత్ ను ఓడించింది.
భారత జట్టు
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, దయాలన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కిరణ్ నవగిరే.
స్టాండ్ బై ప్లేయర్లు
తానియా భాటియా, సిమ్రాన్ బహదూర్
India have announced their squad for the women’s Asia Cup to be held in Bangladesh in October pic.twitter.com/AnxzGEVzWO
— ESPNcricinfo (@ESPNcricinfo) September 21, 2022