Women T20 WC Semi-Final: సెమీస్ గండం దాటేనా!- టీ20 ప్రపంచకప్ లో నేడు భారత్- ఆస్ట్రేలియా పోరు
Women T20 WC Semi-Final: మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్- ఆస్ట్రేలియాల మధ్య నేడే సెమీఫైనల్ మ్యాచ్. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Women T20 WC Semi-Final: ఓవైపు... గత 6 ప్రపంచకప్పుల్లో 5 ట్రోఫీలు గెలిచిన జట్టు. మరోవైపు... ఒక్కసారైనా మెగా టోర్నీని గెలుచుకోవాలని ఆరాటపడుతున్న జట్టు. స్టార్లతో నిండి ప్రపంచ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న జట్టు ఒకటైతే... సమష్టి ఆటే బలంగా పోటీకి సై అంటోంది మరో జట్టు. మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్- ఆస్ట్రేలియాల మధ్య నేడే సెమీఫైనల్ మ్యాచ్. ప్రపంచకప్ గెలవాలన్న సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలనే ధ్యేయంతో ఉన్న భారత జట్టుకు అసలైన సవాల్ ఆస్ట్రేలియా రూపంలో ఎదురైంది. 2020లో టైటిల్ కు దగ్గరగా వచ్చిన భారత మహిళల జట్టును ఫైనల్ లో ఆస్ట్రేలియా ఓడించింది. అయితే ఇప్పుడు ఆ గండం సెమీస్ లోనే ఎదురైంది. వరల్డ్ కప్ ను అందుకోవాలనే కలను నెరవేర్చుకోవాలంటే ముందు ఆస్ట్రేలియా కొండను ఢీకొట్టాల్సిందే.
ప్రపంచ మహిళల క్రికెట్లోనే ఆస్ట్రేలియా బలమైన జట్టు. గత 6 ప్రపంచకప్పుల్లో 5 గెలుచుకుందంటే ఆసీస్ జట్టు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత రికార్డులు, ప్రదర్శన, చరిత్ర ఏది చూసుకున్నా ఆస్ట్రేలియా జట్టు ఫేవరెట్ అనడంలో సందేహంలేదు. మరోవైపు ఈ మెగా టోర్నీలో భారత్ సెమీస్ గండాన్ని ఎదుర్కొంటోంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఐదో సారి సెమీఫైనల్ కు చేరుకుంది. అయితే 2020లో తప్ప ఒక్కసారి కూడా ఫైనల్ కు వెళ్లలేదు. 2020లోనూ ఇంగ్లండ్ తో సెమీస్ వర్షం కారణంగా రద్దవటంతో గ్రూపులో అగ్రస్థానం కారణంగా తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో అన్ని మ్యాచులు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంతో నాకౌట్ కు చేరుకుంది. అయితే భారత్ మాత్రం తడబడుతూనే సెమీస్ కు వచ్చింది. గ్రూప్ దశలో ఇంగ్లండ్ తో ఓడిన భారత్.. మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది.
కలిసికట్టుగా ఆడాలి
సెమీస్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించాలంటే భారత్ శక్తికి మించి పోరాడాల్సిందే. సమష్టిగా సత్తా చాటితేనే డిఫెండింగ్ ఛాంపియన్ పై పైచేయి సాధించవచ్చు. గతేడాది డిసెంబర్ లో జరిగిన టీ20 టోర్నీలో ఆసీస్ పై సూపర్ ఓవర్ లో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపు మన అమ్మాయిలకు కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్నిచ్చేదే. ఇప్పుడు మళ్లీ అదే ప్రదర్శన పునరావృతం చేయాలి. బ్యాటింగ్ లో స్మృతి మంధాన, రిచా ఘోష్ ల పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. వీరిద్దరూ ఇప్పటివరకు ఈ టోర్నీలో నిలకడగా రాణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ లు తమ సత్తా మేరకు రాణించాల్సి ఉంది. బౌలింగ్ లో జోరుమీదున్న రేణుకాసింగ్ ఠాకూర్ కీలకం కానుంది. అలాగే దీప్తి శర్మ, ఇతర బౌలర్లు కూడా సమష్టిగా సత్తాచాటాలి.
జట్టు నిండా స్టార్లతో ఆసీస్
ఆసీస్ జట్టు స్టార్లతో నిండి ఉంది. కెప్టెన్ మెగ్ లానింగ్, అలీసా హేలీ, బెత్ మూనీ, తహిల మెక్ గ్రాత్, ఎలీస్ పెర్రీ, మెగాన్ షట్.. ఇలా ఆ జట్టు నిండా స్టార్లే. వీరంతా రాణిస్తే భారత్ కు పరాభవం తప్పదు. ఆస్ట్రేలియా జట్టును ఓడించాలంటే భారత మహిళలు శక్తికి మించి పోరాడాల్సిందే.
రికార్డులు
ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు భారత్ 30 టీ20లు మ్యాచ్ లు ఆడింది. అందులో 7 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా 22 గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఈ రెండు జట్లు 5 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. అందులో టీమిండియా 2 విజయాలు సాధించగా.. ఆసీస్ మూడింట్లో నెగ్గింది.
భారత జట్టు (అంచనా)
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుకా ఠాకూర్ సింగ్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, అంజలికా శర్వానీ.
ఆస్ట్రేలియా జట్టు (అంచనా)
బెత్ మూనీ(వికెట్ కీపర్), ఎల్లీస్ పెర్రీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీగ్ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్‌హామ్, అలనా కింగ్, మేగాన్ షట్, అలిస్సా హీలీ, హీథర్ గ్రాహం.
𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙎𝙀𝙈𝙄𝙎! 🙌 🙌#TeamIndia have marched into the Semi Final of the #T20WorldCup 👏 👏
— BCCI Women (@BCCIWomen) February 20, 2023
Well Done! 👍 👍 pic.twitter.com/mEbLtYhSm5