Virat Kohli : కోహ్లీ మొదలెట్టేశాడు, అవకాశాన్ని వదులుతాడా ?
Virat Kohli: టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఒక్కసారి టచ్‌లోకి వస్తే కోహ్లీని ఆపడం ఎవరి తరమూ కాదు.
Virat Ready for the Show: ఐపీఎల్(IPL) 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. దీనికి ఇంకా మూడు రోజులు కూడా సమయం లేదు. మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా రన్ మెషీన్, స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ వచ్చేశాడు. ఐపీఎల్ 2024లో పాల్గొనేందుకు భారత గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరిన కోహ్లి.. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. కోహ్లీతో పాటు కెప్టెన్ డుప్లెసిస్ సాధన చేశాడు. భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లిన కోహ్లి.. ఆదివారమే స్వదేశానికి తిరిగొచ్చాడు.
టీ 20 ప్రపంచకప్‌కు అవకాశమిదే
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్(T20 World Cup) సెమీ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోయిన తర్వాత.. విరాట్ టీమ్ఇండియా తరుపున ఒక్క టీ20 మ్యాచ్ లోనూ కోహ్లీ రాణించలేదు. దీంతో పొట్టి క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు పలికినట్లేనని.. అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్ పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు ఓ అవకాశం ఉంది అదే ఐపీఎల్. బెంగళూరు తరపున బరిలోకి దిగుతున్న కోహ్లీ మరోసారి విశ్వరూపం చేస్తే పొట్టి ప్రపంచకప్‌లో విరాట్ స్థానం పదిలమే. వఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు... చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ నుంచి తన ఐపీఎల్ సీజన్ ప్రయాణాన్ని ప్రారంభించనున్న కోహ్లీ... ఫామ్‌లోకి వస్తే టీ 20 ప్రపంచకప్‌లో స్థానం ఖాయమే. ఒక్కసారి టచ్‌లోకి వస్తే కోహ్లీని ఆపడం ఎవరి తరమూ కాదు. ఐపీఎల్‌లో మరో ఆరు పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్‌లో 12,000 రన్స్ చేసిన ఆరో ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. ఇంతటి ఘన రికార్డులు ఉన్న కోహ్లీ.. అంత తేలిగ్గా అవకాశాన్ని వదులుకుంటాడా. వదలడు విధ్వంసం సృష్టిస్తాడు.
అకాయ్ రాకతో అదృష్టమే
కోహ్లి వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తొలుత కథనాలు వచ్చాయి. అయితే భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు కోహ్లి విరామం తీసుకున్నట్లు తర్వాత స్పష్టమైంది. కోహ్లి, అనుష్క దంపతులకు ఇప్పటికే ఓ కూతురున్న సంగతి తెలిసిందే. విరాట్ సతీమణి అనుష్క శర్మ ఇటీవల లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు అకాయ్ అనే పేరును పెట్టినట్లు విరాట్, అనుష్కశర్మలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుటుంబంతో గడిపేందుకు లండన్ వెళ్లిన కోహ్లీ.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.