కోహ్లీ ఎన్నాళ్లకెన్నాళ్లకు - స్వదేశంలో ఆసీస్ పై 10 ఏళ్ల తరువాత శతకం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రన్ మేషిన్ కోహ్లీ సెంచరీ చేశాడు. అయితే స్వదేశంలో ఆసీస్ పై 10 ఏళ్ల తరువాత కోహ్లీ చేసిన శతకం ఇది.
Virat Kohli Test Century టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు టెస్టుల్లో మరో శకతం బాదేశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రన్ మేషిన్ కోహ్లీ సెంచరీ చేశాడు. దాదాపు 1200 రోజుల తరువాత కోహ్లీ టెస్టు సెంచరీ చేయగా.. చివరగా 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ చేశాడు. తాజా శతకానికి దాదాపు మూడున్నరేళ్లు వేచి చూశాడు. ఇదివరకే వన్డేలు, టీ20ల్లో శతకాలతో ఫామ్ లోకి వచ్చినా టెస్టుల్లో మాత్రం శతకం కోసం 40 ఇన్నింగ్స్ లు ఎదురుచూశాడు.
ఆసీస్ పై 10 ఏళ్ల తరువాత శతకం..
ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టుపై స్వదేశంలో దాదాపు పదేళ్ల తర్వాత కోహ్లీ శతకం బాదాడు. చివరగా 2013లో చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. అంటే కోహ్లీ కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో శతకం తరువాత, నేడు తాజాగా భారత గడ్డపై కోహ్లీ ఈ మార్క్ చేరుకున్నాడు. ఇన్నింగ్స్ 139వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన కోహ్లీ టెస్టుల్లో ఇది 28వ సెంచరీ నమోదు చేశాడు.. వన్డే, టీ20, టెస్టుల్లో కలిపి ఓవరాల్ గా ఇంటర్నేషనల్ కెరీర్ లో75వ శతకం. సచిన్ 100 శతకాల తరువాత రెండో స్థానంలో ఉన్న ఆటగాడు కోహ్లీనే. మరో 25 శతకాలు నమోదు చేస్తే ఆల్ టైమ్ గ్రేట్ సచిన్ సరసన కోహ్లీ నిలుస్తాడు.
The Man. The Celebration.
— BCCI (@BCCI) March 12, 2023
Take a bow, @imVkohli 💯🫡#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9
అసలే మూడో టెస్టులో భారత్ దారుణంగా ఓటమిపాలైంది. భారత్ కు కీలకమైన మ్యాచ్ కావడంతో మొదట టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (235 బంతుల్లో 128, 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదంతొక్కగా, నేడు కోహ్లీ భారీ శతకంతో రాణించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ తడబాటు లేకుండా క్రీజులో నిలిచి, 241 బంతుల్లో దాదాపు మూడున్నరేళ్ల తరువాత టెస్టు శతకం నమోదు చేశాడు కోహ్లీ. ఈ టెస్ట్ శతకం చేయడానికి 41 టెస్టు ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. తాజా శతకం కోహ్లీ కెరీర్ లో రెండో నెమ్మదైన టెస్ట్ శతకం. గతంలో ఇంగ్లాండ్ జట్టుపై 289 బంతుల్లో చేసిన సెంచరీనే స్లో సెంచరీ.
Going strong and how 💪💪
— BCCI (@BCCI) March 12, 2023
100-run partnership comes up between @imVkohli & @akshar2026 👏👏
150 runs up for King Kohli.
Live - https://t.co/8DPghkx0DE #INDvAUS @mastercardindia pic.twitter.com/UgVqnPYaML
ఓవర్‌నైట్ స్కోరు 289/3తో నాలుగో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. రవీంద్ర జడేజా (28; 84 బంతుల్లో 2x4, 1x6), శ్రీకర్ భరత్ (44; 88 బంతుల్లో 2x4, 3x6) ఆచితూచి ఆడాడు. లంచ్ వరకు 362/4 స్కోర్‌తో ఉన్న భారత్ ఆపై టీ బ్రేక్ సమయానికి భారత్ 158 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 472 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 150 మార్క్ చేరుకుని వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరో ఎండ్ లో అక్షర్ పటేల్ (50; 95 బంతుల్లో 4x4, 1x6) హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీరిస్ లో మూడో హాఫ్ సెంచరీతో అక్షర్ రాణించాడు. వీరిద్దరూ 6వ వికెట్ కు 100 పరుగుల పైగా భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు. ఈ టెస్టులో భారత్ విజయం సాధిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుతుంది. లేకపోతే మరో టెస్ట్ సిరీస్ లో లంక మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.