ICC ODI rankings: బాబర్ ఆజామ్‌కు ఎసరు పెట్టిన కింగ్ కోహ్లీ!
ICC ODI rankings: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ర్యాంకుల దుమ్ము దులుపుతున్నాడు! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్-5లోకి చేరుకున్నాడు.
ICC ODI rankings:
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ర్యాంకుల దుమ్ము దులుపుతున్నాడు! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్-5లోకి చేరుకున్నాడు. వీరోచిత ఫామ్‌తో అగ్రస్థానంలోని ఆటగాళ్లకు సవాళ్లు విసురుతున్నాడు. తాజాగా రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు ఎసరు పెట్టేందుకు సిద్ధమయ్యాడు.
శ్రీలంకతో వన్డే సిరీసులో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు కొట్టాడు. మూడు ఇన్నింగ్సుల్లోనే 283 పరుగులు సాధించాడు. దాంతో 750 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకాడు. రెండో స్థానంలోని రసివాన్ డర్ డుసెన్ (766), క్వింటన్ డికాక్ (795)కు కొద్ది దూరంలోనే ఉన్నాడు. బాబర్ ఆజామ్ 887 రేటింగ్‌తో నంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నాడు.
విరాట్ కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్ తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. లంక సిరీసులో సెంచరీ సాయంతో 69 సగటుతో 207 పరుగులు చేసిన గిల్ 10 ర్యాంకులు ఎగబాకి 26కు చేరుకున్నాడు. తొమ్మిది వికెట్లు పడగొట్టిన సిరాజ్ ఏకంగా 15 స్థానాలు జంప్ చేసి మూడో ర్యాంకు అందుకున్నాడు. ఈ సిరీసులో అతడి కన్నా ఎక్కువ వికెట్లు ఎవ్వరూ తీయలేదు. ప్రస్తుతం అతడి ఖాతాలో 685 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న ట్రెంట్ బౌల్ట్ (730), హేజిల్ వుడ్ (727)ను దాటేందుకు మరికాస్త కష్టపడితే చాలు.
టీమ్ఇండియా మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్ యాదవ్ ఏడు స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకుకు చేరుకున్నాడు. లంక సిరీసులో అతడు రెండు మ్యాచుల్లోనే 5 వికెట్లు పడగొట్టడం గమనార్హం. బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (10) మాత్రమే టాప్ 10లో ఉన్నారు. బౌలింగ్ జాబితాలో సిరాజ్ ఒక్కడే చోటు సంపాదించాడు.
View this post on Instagram