Yograj Singh: అర్జున్ టెండూల్కర్‌కు ఓ స్టార్ క్రికెటర్ తండ్రి కోచింగ్- సచిన్ కుమారుడుననే విషయం మర్చిపోవాలంటూ కండిషన్
Yograj Singh: అరంగేట్ర రంజీ మ్యాచ్ లోనే శతకం బాదిన అర్జున్ టెండూల్కర్ కు... సచిన్ కుమారుడుననే విషయం మర్చిపొమ్మని ఓ కోచ్ చెప్పారట. ఎవరా కోచ్? ఎందుకలా చెప్పారు? తెలియాలంటే ఇది చదివేయండి.
Yograj Singh: భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన అరంగేట్ర రంజీ మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ రాజస్థాన్ పై 207 బంతుల్లో 120 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతను ఈ ఫీట్ సాధించాక భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ నుంచి ప్రత్యేక సందేశాన్ని అందుకున్నాడు. బాగా ఆడావు. త్వరలోనే నీవు గొప్ప ఆల్ రౌండర్ గా ఎదుగుతావు అని యోగ్ రాజ్ అర్జున్ కు మెసేజ్ పంపించాడు. ఇంతకీ యువరాజ్ తండ్రికి, అర్జున్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా!
మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు
అర్జున్ టెండూల్కర్ రంజీ అరంగేట్రానికి ముందు యోగరాజ్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ టోర్నీకి ముందు చండీగఢ్ లో అర్జున్ కు యోగరాజ్ 15 రోజుల శిక్షణ ఇచ్చాడు. ఈ సందర్భంగా తనకు, తన కుమారుడు యువరాజ్ సింగ్ కు మధ్య అర్జున్ గురించి జరిగిన సంభాషణను యోగరాజ్ పంచుకున్నారు. 'సెప్టెంబర్ మొదటివారంలో నాకు యువీ నుంచి ఫోన్ వచ్చింది. 'నాన్న, అర్జున్ 2 వారాలపాటు చండీగఢ్ లో ఉంటాడు. మీకు సమయం ఉంటే అతనికి శిక్షణ ఇవ్వమని సచిన్ నన్ను అడిగాడు' అని యువీ చెప్పాడు. సచిన్ నాకు పెద్ద కొడుకులాంటి వాడు. కాబట్టి అతని అభ్యర్ధనను నేను మన్నించాను. అయితే యువీతో ఒకటే చెప్పాను. నా శిక్షణా విధానం ఎలా ఉంటుందో నీకు తెలుసు. నేను కోచింగ్ ఇచ్చే సమయంలో ఎవరూ మధ్యలో కలగజేసుకోకూడదు' అని యువీతో చెప్పాను. అని యోగరాజ్ అన్నారు.
సచిన్ కొడుకునని మర్చిపో
రాబోయే 15 రోజులు సచిన్ కుమారుడుననే విషయం మర్చిపోవాలని యోగరాజ్ సింగ్ అర్జున్ టెండూల్కర్ కు చెప్పారట. తన తండ్రి నీడ నుంచి బయటకు రావాలని సూచించారట. 'అర్జున్ కు నేను ఇదే చెప్పాను. తన తండ్రి నీడ నుంచి బయటపడాలని. ఉదయం 5 గంటలకు మేల్కొనేవాడు. 2 గంటలు పరుగు. దాని తర్వాత జిమ్ సెషన్. అర్జున్ భారీ బరువులు ఎత్తలేడు. కాబట్టి బాడీ వెయిట్ వ్యాయామాలు చేయమని సలహా ఇచ్చాను. నేను అతని బ్యాటింగ్ చూసినప్పుడు అతను విధ్వంసం సృష్టించగలడని నాకర్ధమైంది. ఇదే విషయం సచిన్ కు ఫోన్ చేసి చెప్పాను.' అని యోగరాజ్ అన్నారు.
గత సీజన్‌లో ముంబై రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ అర్జున్‌ని జట్టులో చేర్చింది. అయితే అతను తుది జట్టులో లేడు. ఆ తర్వాత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ ను వేలంలో కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ టెండూల్కర్ గోవా తరఫున ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. అందుకే మమ్మల్ని సంప్రదించాడు. అందుకు ముందు ఎంసీఏ నుంచి నిరభ్యంతర పత్రం పొందమని మేం చెప్పాం. అతనిని ఎంపిక చేసేముందు ఫిట్ నెస్, స్కిల్ టెస్ట్ లాంటి ప్రక్రియను అనుసరించాం. అని గోవా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ విపుల్ ఫడ్కే తెలిపారు.
“In an attempt to revive son #ArjunTendulkar career, Sachin decided to let him train under the watchful eyes @YUVSTRONG12 father Yograj Singh”.https://t.co/8Zk9sdDBxZ
— Nitin Srivastava (@TweetNitinS) December 15, 2022