Virat Kohli: నా బెస్ట్ ఇదే - తన ఇన్నింగ్స్‌పై విరాట్ కోహ్లీ రియాక్షన్!
టీ20ల్లో తన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదేనని విరాట్ కోహ్లీ అన్నాడు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని కోహ్లి ప్రారంభంలో మెల్లగా ఆడాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) వికెట్లు భారత్ అవకాశాలను మరింత దెబ్బతీశాయి. తర్వాత విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా (40) భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించారు.
వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ఆశలను సజీవంగా ఉంచారు. డెత్ ఓవర్లలో కోహ్లి తన క్లాస్ చూపించాడు. పేస్ ద్వయం షాహీన్ ఆఫ్రిది, హరీస్ రౌఫ్‌ల బౌలింగ్‌లో కూడా బౌండరీలు సాధించాడు. మొదటి 23 బంతుల్లో 15 పరుగులు చేసిన కోహ్లీ, ఆ తర్వాత 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. దీంతో 43 బంతుల్లో 50 అర్థ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కేవలం 10 బంతుల్లోనే 32 పరుగులు కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఈ ఇన్నింగ్స్‌ను తన బెస్ట్ ఇన్నింగ్స్ అని విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం తెలిపాడు. ‘ఇది ఒక నమ్మశక్యం కాని మూమెంట్. నిజం చెప్పాలంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. నిన్ను నువ్వు నమ్ము, చివరి వరకు ఉండమని హార్దిక్ నాకు చెప్తూనే ఉన్నాడు. నవాజ్ ఒక ఓవర్ వేయాలనేది మర్చిపోలేదు. హరీస్ రౌఫ్‌ను బాగా ఆడితే, అప్పుడు వారు భయాందోళనలకు గురవుతారు. ఎందుకంటే అతను వారి ప్రధాన బౌలర్. 19వ ఓవర్లో ఆ రెండు సిక్సర్లు కొట్టడానికి నన్ను నేను ఎంతో మోటివేట్ చేసుకున్నాను. దీంతో సమీకరణం 8 బంతుల్లో 28 పరుగుల నుంచి 6 బంతుల్లో 16 పరుగులకు వచ్చేసింది.’
‘ఈరోజు వరకు నేను ఆస్ట్రేలియాపై మొహాలీ (2016 T20 ప్రపంచ కప్) ఇన్నింగ్స్ నా అత్యుత్తమమని చెప్పాను. నేను అక్కడ 52 బంతుల్లో 82 పరుగులు సాధించాను. ఈరోజు నేను 53 బంతుల్లో 82 పరుగులు చేశాను. కానీ నాకు ఈ ఇన్నింగ్సే గొప్పది. ఒకానొక పరిస్థితిలో విజయం అసాధ్యం అనిపించింది. కానీ హార్దిక్ నన్ను పుష్ చేస్తూనే ఉన్నాడు.’ అని మ్యాచ్ తర్వాత కోహ్లీ భావోద్వేగంతో చెప్పాడు.
View this post on Instagram