Team India Squad: టీ20 మహా సంగ్రామానికి భారత సైన్యం ఇదే - వరల్డ్‌కప్‌కు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ!
టీ20 వరల్డ్‌కప్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. మరో నలుగురిని స్టాండ్‌బైగా ఎంచుకున్నారు.
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది జట్టులో ఉండగా... మరో నలుగురిని స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. మోకాలి గాయం కారణంగా రవీంద్ర జడేజా టోర్నమెంట్‌కు దూరం అవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బ. పొదుపుగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడంతో పాటు ఆఖరి ఓవర్లలో పవర్ హిట్టింగ్ చేయగల సామర్థ్యం జడేజా సొంతం. ఇక మైదానంలో జడేజా ప్రపంచంలోనే నంబర్ వన్ ఫీల్డర్ అన్న విషయాన్ని కూడా ఇక్కడ మర్చిపోకూడదు.
ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. 15 మంది ఉన్న జట్టులో నలుగురు పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్, ఇద్దరు వికెట్ కీపర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు, నలుగురు పేసర్లు ఉన్నారు. యుజ్వేంద్ర చాహల్ ఒక్కడే పూర్తి స్థాయి స్పిన్నర్. ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌ల్లో ఒకరు రెండో స్పిన్నర్ బాధ్యతను నిర్వర్తించనున్నారు.
అక్టోబర్ 16వ తేదీ నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 23వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు నేరుగా సూపర్-12 మ్యాచ్ ఆడనుంది.
మొదట ఎనిమిది జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటిలో శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. వీటిలో నాలుగు జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.
సూపర్-12 గ్రూప్ 1కు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ 2కు ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్ నుంచి వచ్చిన నాలుగు జట్లలో చెరో రెండు టీమ్‌లు సూపర్-12 గ్రూపుల్లో చేరనున్నాయి. నవంబర్ 13వ తేదీన జరిగే ఫైనల్‌తో ఈ మహా సంగ్రామం ముగియనుంది.
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు
మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
View this post on Instagram