MK Stalin on Dhoni: ధోని తమిళనాడు దత్తపుత్రుడు - సీఎస్కే సారథిపై సీఎం స్టాలిన్ ప్రశంసలు
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రశంసలు కురిపించారు.
MK Stalin on Dhoni: ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్‌కు కర్త, కర్మ, క్రియగా ఉంటున్న ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. తాను కూడా ధోని ఆటకు వీరాభిమానినేనని అన్న స్టాలిన్.. సీఎస్కే సారథిని తమిళనాడు దత్తపుత్రుడిగా అభివర్ణించాడు. ఇదే ధోనికి చివరి సీజన్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడు మరికొన్ని రోజులు చెన్నైని నడిపించాలని సీఎం కోరారు.
చెన్నైలో సోమవారం రాత్రి ‘తమిళనాడు ఛాంపియన్‌షిప్ ఫౌండేషన్’ ప్రారంభ కార్యక్రమంలో స్టాలిన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ‘తమిళనాడులో చాలా మంది మాదిరే నేను కూడా ధోనికి వీరాభిమానిని. ఇటీవలే నేను ఐపీఎల్ మ్యాచ్‌లలో ధోని ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు గాను చెపాక్ (ఎం.ఎ. చిదంబరం స్టేడియం)కు కూడా రెండు సార్లు వెళ్లాను. మా తమిళనాడు దత్తపుత్రుడు సీఎస్కే తరఫున మరికొన్నాళ్లు కొనసాగుతాడని ఆశిస్తున్నా..’అని చెప్పారు. తమిళ అభిమానులు ‘తాల’ (అన్న) అని పిలుచుకునే ధోనిది స్వరాష్ట్ర జార్ఖండ్ అన్న విషయం విదితమే.
CM of Tamil Nadu said "I am a big fan of MS Dhoni, hope our adopted son of Tamil Nadu will continue to play for CSK, he is an inspiration" [ANI] pic.twitter.com/gMOM9l4zmo
— Johns. (@CricCrazyJohns) May 8, 2023
ధోని ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పిన స్టాలిన్.. తమిళనాడు ఛాంపియన్‌షిప్ ఫౌండేషన్ కు ఆయననే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు వెల్లడించారు. ‘మేం ఈ ప్రోగ్రామ్ కు ధోనిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాం. తమిళనాడులో రాబోయే రోజుల్లో మేం మరింత మంది ధోనీలను తయారుచేయాలని భావిస్తున్నాం. ఒక్క క్రికెట్ లోనే కాదు.. మిగిలిన క్రీడల్లో కూడా ధోని వంటి మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేస్తాం..’అని ఆయన తెలిపారు.
పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌తో ఏర్పాటైన తమిళనాడు ఛాంపియన్‌షిప్ ఫౌండేషన్ ప్రీలాంచ్ ను మే 3న ఏర్పాటుచేయగా దీనికి ఇప్పటికే రూ. 23.50 కోట్ల నిధులు సమకూరినట్టు సమాచారం. తమిళనాడు క్రీడాశాఖ మంత్రి, స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్ ఈ ఫౌండేషన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. కాగా స్టాలిన్ తో పాటు ఉదయనిది కూడా చెన్నై గతంలో లక్నో, పంజాబ్ మ్యాచ్‌లు చూడటానికి చెపాక్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఉదయనిది స్టాలిన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
My heartfelt thanks to Hon'ble CM @mkstalin for inaugurating the Tamil Nadu Champions Foundation & his generous contribution of Rs.5 Lakhs towards the initiative. We also extend our sincere thanks to Thiru @msdhoni for launching the foundation's logo and website. With this… pic.twitter.com/ILrlwf1pdd
— Udhay (@Udhaystalin) May 8, 2023
ధోని రిటైర్మెంట్‌పై సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు :
ఇటీవలే చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై - ముంబై మ్యాచ్ లో కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చిన రైనా ధోని రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ.. ‘‘అందరూ ఇదే విషయం అడుగుతున్నారు. దీని గురించి నువ్వేమనుకుంటున్నావ్ అని అడగ్గా ధోని నాతో ‘ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరో ఏడాది ఆడతా. అప్పుడు చూద్దాం’ అని నాతో చెప్పాడు’’ అని రైనా చెప్పాడు.