United States vs South Africa Super 8 Prediction: టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024)లో అసలు సమరం కాసేపట్లో ప్రారంభం కానుంది. లీగ్ దశలో సంచలనాలు సృష్టించిన పసికూన అమెరికా(USA)-పటిష్టమైన సౌతాఫ్రికా(SA)తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో పాకిస్థాన్(Pakistan)కు షాక్ ఇచ్చి.. భారత్(India)పై పోరాడి ఓడి సూపర్ ఎయిట్‌లో స్థానం దక్కించుకున్న అమెరికా... సూపర్ ఎయిట్(Super 8)లోనూ సత్తా చాటాలని చూస్తోంది.
ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి మంచి టచ్‌లో ఉన్న సౌతాఫ్రికా... సూపర్ ఎయిట్‌లో తొలి అడుగు బలంగా వేయాలని చూస్తోంది. పసికూన అమెరికాపై సాధికార విజయం సాధించి... సెమీస్ వైపు ఒక అడుగు వేయాలని ప్రొటీస్ వ్యూహాలు రచిస్తోంది. ఆంటిగ్వాలో జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లలోని స్పిన్నర్లు కీలకంగా మారనున్నారు. ఇప్పటికే విండీస్‌లోని పిచ్‌లపై స్పిన్నర్లు సత్తా చాటుతుండడంతో ఈ మ్యాచ్‌లో కూడా స్పిన్ కీలక పాత్ర పోషించే ఉంది.
పటిష్టంగా దక్షిణాఫ్రికా
లీగ్ దశలో దక్షిణాఫ్రికా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి బలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించిన ప్రొటీస్ రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, నేపాల్‌పై వరుస విజయాలు సాధించి సూపర్ ఎయిట్‌కు చేరుకుంది. ఈ ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం దక్షిణాఫ్రికాను వేధిస్తోంది. పవర్ ప్లేలో ఆడిన నాలుగు మ్యాచుల్లో 11 వికెట్లు కోల్పోయిన ప్రొటీస్... 9.63 సగటుతో పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్లలో ఎవరికీ మొదటి ఆరు ఓవర్లలో స్ట్రైక్ రేట్ 100 దాటలేదు. దక్షిణాఫ్రికా ఆడిన నాలుగు మ్యాచులను కూడా న్యూయార్క్‌లో ఆడింది. న్యూయార్క్‌లో బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు లేవు. అయితే ఇప్పుడు మ్యాచ్‌లో విండీస్‌లో జరగనుండడంతో బ్యాట్‌తో రాణించాలని ప్రొటీస్ భావిస్తోంది.
అమెరికా రాణించేనా
అమెరికా ప్రపంచకప్‌నకు ముందు, తర్వాత సొంత దేశంలోనే 12 మ్యాచులు ఆడింది. 12 మ్యాచుల తర్వాత వెస్టిండీస్‌లో దక్షిణాఫ్రికాతో అమెరికా తలపడనుంది. అయితే లీగ్ దశలో కొనసాగించిన అద్భుత పోరాటాన్ని సూపర్ ఎయిట్‌లోనూ కొనసాగించాలని అమెరికా భావిస్తోంది. కెనడా, పాకిస్థాన్‌లపై విజయం సాధించిన అమెరికా... భారత్‌పైనా పోరాడింది. ఆరోన్ జోన్స్, సౌరభ్ నేత్రావల్కర్, మోనాంక్ పటేల్ అమెరికా జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. సౌరభ్ నేత్రావల్కర్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను అవుట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన నేత్రావల్కర్... ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే ప్రొటీస్‌కు తిప్పలు తప్పవు.
అమెరికా జట్టు( అంచనా) : స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్/నోస్తుష్ కెంజిగే, జస్దీప్ సింగ్ , సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్
దక్షిణాఫ్రికా ( అంచనా) : క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, తబ్రైజ్ షమ్సీ/కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఒట్నీల్ బార్ట్‌మాన్, 11 అన్రిచ్ నార్ట్జే