Mohammed Shami - Bumrah: బుమ్రా ప్లేస్‌లో షమీ రైట్! టీమ్‌ఇండియాకు సచిన్ సలహాలు, చురకలు!
T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద లోటేనని టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్ అంటున్నాడు. అతడి స్థానంలో మహ్మద్ షమి ఎంపిక సరైందేనని పేర్కొన్నాడు.
Sachin tendulkar about T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద లోటేనని టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్ అంటున్నాడు. అతడి స్థానంలో మహ్మద్ షమి ఎంపిక సరైందేనని పేర్కొన్నాడు. జట్టులో కుడి ఎడమ కాంబినేషన్ ఉండటం అవసరమని వెల్లడించాడు. అర్షదీప్ సింగ్ టెంపర్‌మెంట్ బాగుందని ప్రశంసించాడు. మైదానాలు, వాతావరణం, ఇతర పరిస్థితులను అనుసరించి ఛేదన సులభం అవుతోందని స్పష్టం చేశాడు. పీటీఐకి అతడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు.
షమి సూపర్
జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం లోటే. అతడి స్థానంలో వికెట్లు తీసే బౌలర్ కావాలి. అత్యంత వేగంగా కట్టుదిట్టంగా బంతులు విసిరి వికెట్లు తీసే పేసర్ అవసరం. బుమ్రా స్థానంలో తన ఎంపిక సరైందేనని మహ్మద్ షమి నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచులో ఆఖరి ఓవర్లో అతడు మూడు వికెట్లు పడగొట్టడమే ఇందుకు నిదర్శనం.
అర్షదీప్ టెంపర్‌మెంట్
యువ పేసర్ అర్షదీప్ నమ్మకం పెంచుతున్నాడు. సమతూకంగా కనిపిస్తున్నాడు. చాలా కమిటెడ్‌గా ఉన్నాడు. అతడి మనస్తత్వాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అతడి వద్ద ఏదైనా ప్లాన్ ఉంటే దానికి కట్టుబడి ఆడుతున్నాడు. అతడిలో నాకు నచ్చేది ఇదే. ఎందుకంటే టీ20లో బ్యాటర్లు సరికొత్త షాట్లు ఆడుతూనే ఉంటారు. అదనపు పరుగుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు అనుకున్న ప్లాన్‌కు కట్టుబడి ఉండటం అవసరం.
View this post on Instagram
స్టేడియాన్ని బట్టి స్పిన్నర్ ఎంపిక
టీమ్‌ఇండియా మెల్‌బోర్న్, సిడ్నీ, అడిలైడ్, పెర్త్ స్టేడియాల్లో మ్యాచులు ఆడనుంది. ఈ మైదానాలు చాలా పెద్దవి. వాటి డైమెన్షన్‌ను బట్టి తుది జట్టులోకి స్పిన్నర్లను తీసుకోవడం మంచిది. ఆస్ట్రేలియా పిచ్‌లపై స్పిన్‌ను నిలకడగా ఎదుర్కొనే బ్యాటర్లు కొద్దిమందే ఉంటారు. అందుకే స్టేడియం డైమెన్షన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, ఎడమచేతి స్పిన్నర్‌ను ఆడించాలి. గాలి ఎటువైపు వీస్తుందో గమనించి స్పిన్నర్‌ను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ఆఫ్‌స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే ఆఫ్‌సైడ్ బౌండరీ సరిహద్దు తక్కువగా ఉండే ఎండ్ నుంచి బౌలింగ్ చేయించాలి.
లెఫ్టే రైటు!
టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్లో వరుసగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ ఉన్నారు. వీరంతా కుడిచేతి వాటం బ్యాటర్లే. జట్టులో కుడి ఎడమ కూర్పు ఉండటం అవసరం. లెఫ్ట్ హ్యాండర్లకు జట్టుకు విలువను తీసుకొస్తారనడటంలో సందేహం లేదు. అతడు స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే బౌలర్లు, ఫీల్డర్లు సైతం ప్రతిసారీ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. టాప్-3 గురించే నేను ఆలోచించను. ఎందుకంటే ఒక యూనిట్‌గా ఆడాలి. ఏ పొజిషన్లో ఎవరిని పంపించాలన్నది కీలకం. ప్రత్యర్థి బలాన్ని బట్టి వ్యూహం అనుసరించాలి. భారత్ కొన్నిసార్లు స్కోర్లను కాపాడుకోలేక పోతోంది. టాస్, వాతావరణం, స్టేడియం వంటివి సైతం ఇందుకు అడ్డంకిగా మారుతున్నాయి.