Sarfaraz Khan: సర్ఫరాజ్‌కు టెస్ట్ క్యాప్ ! నిరవేరిన ఓ తండ్రి కల
Sarfaraz Khan: దేశానికి ప్రాతినిధ్యం వహించాలని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ఖాన్ కల నెరవేరింది. 26 ఏళ్ల సర్ఫరాజ్ రాజ్‌కోట్‌లో నేడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో బరిలోకి దిగుతున్నాడు.
![Sarfaraz Khan: సర్ఫరాజ్‌కు టెస్ట్ క్యాప్ ! నిరవేరిన ఓ తండ్రి కల Sarfaraz Khans father cries inconsolably holding sons Test cap Sarfaraz Khan: సర్ఫరాజ్‌కు టెస్ట్ క్యాప్ ! నిరవేరిన ఓ తండ్రి కల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/e6e543e68d0e0ec5690d8f689ed2d1171707977949002872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sarfaraz Khan Father And Mother Emotion : దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్( Sarfaraz Khan) టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదగా టీమిండియా టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. ఈ సందర్భంగా కుమారుడి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సర్ఫరాజ్ తండ్రి నౌషద్, ఆయన భార్య కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే టెస్టు క్యాప్ అందివ్వగానే ఇద్దరూ ఆనందభాష్పాలు రాల్చారు. క్యాప్ ప్రెజెంటేషన్ తర్వాత కుమారుడిని నౌషద్ ఆలింగనం చేసుకుని క్యాప్‌కు ముద్దిచ్చారు.
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా తరపున యువ స్ట్రైకర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ రంగంలోకి దిగారు. రాహుల్‌కు బదులుగా సర్ఫరాజ్‌కు అవకాశం లభిస్తే, వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ స్థానంలో ధృవ్ జురెల్‌కు అవకాశం లభించింది. సర్ఫరాజ్ ఖాన్ గత మూడేళ్లుగా దేశవాళీ వేదికగా రాణిస్తున్నప్పటికీ.. టీమ్ ఇండియాలో మాత్రం అతనికి అవకాశం రాలేదు. ఈసారి కూడా కేఎల్ రాహుల్ గాయపడి జట్టుకు దూరమవ్వటం , తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో విఫలమైన కారణంగా శ్రేయాస్ అయ్యర్‌ను జట్టు నుంచి తప్పించటం తో సర్ఫరాజ్ ఖాన్‌కు భారత్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. కుమారుడు మైదానంలో దిగుతున్నప్పుడు చూడాలని ఆరాటపడిన సర్ఫరాజ్ కుటుంబం కూడా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు చేరుకుంది.
దేశవాళీలో రికార్డుల మోత
26 ఏళ్ల సర్ఫరాజ్..ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో 161 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్టులోనూ అతడు 96 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 69.85 యావరేజ్‌తో 3912 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు .
ధ్రువ్ జురెల్ తక్కువోడేం కాదు...
22 ఏళ్ల ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. 21 జనవరి 2001న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పుట్టాడు. దేశీవాళీ టీ20 టోర్నమెంట్ ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021’లో ఉత్తరప్రదేశ్ తరపున ధృవ్ బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై 23 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఆకట్టుకునేలా ఆడాడు. రంజీ ట్రోఫీలో విదర్భతో మ్యాచ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను ఆరంభించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేసి మొదటి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ధ్రువ్ కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడడంతో చెప్పకోదగ్గ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏమీ లేవు. 46.47 సగటుతో 790 పరుగులు చేయగా 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో జురెల్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. పరిమితి ఓవర్ల క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 19 టీ20 మ్యాచ్‌లు ఆడి 137.07 స్ట్రైక్ రేట్‌తో 244 పరుగులు చేశాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)