Sanju Samson: రాజస్తాన్ నుంచి సంజూ శాంసన్ ఔట్! యువ ఓపెనర్ చేతికి RR పగ్గాలు
IPL 2026 Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తుంది. సంజూ శాంసన్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని కథనాలు వస్తున్నాయి. త్వరలో దీనిపై ప్రకటన రానుంది.

Sanju Samson all set to leave Rajasthan Royals | రాజస్థాన్ రాయల్స్‌కు IPL 2026లో కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్రాంచైజీకి తాను జట్టును వీడాలని అనుకుంటున్నానని తెలిపాడు. యశస్వి జైస్వాల్‌ను జట్టులో కొనసాగించడానికి కెప్టెన్సీని ఆఫర్ చేశారని కీలక సమాచారం బయటకు వస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో సహా 3 జట్లు శాంసన్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని సమాచారం.
నివేదికల ప్రకారం, సంజు శాంసన్ మాత్రమే కాదు, మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడనున్నాడు. అయితే, జురెల్ 2008 IPL ఛాంపియన్ జట్టును ఎందుకు వీడుతున్నాడనే కారణం తెలియరాలేదు. జైస్వాల్ కూడా RR జట్టును వీడాలని భావించాడు. కానీ కెప్టెన్సీని ఆఫర్ చేయడంతో యువ ఓపెనర్ ఆర్ఆర్ జట్టుతోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంజు శాంసన్ విషయానికి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కూడా శాంసన్ ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే శాంసన్ నిజంగానే రాజస్తాన్ ఫ్రాంచైజీని వీడతాడా.. లేక వేలంలో అతనిపై బిడ్ వేస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
శాంసన్ 2013-15 సీజన్లు, ఆ తర్వాత 2018 నుండి ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు. అతను తన 177 మ్యాచ్‌ల IPL కెరీర్‌లో 4,704 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. IPLలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (మునుపు ఢిల్లీ డేర్‌డెవిల్స్) తరపున ఆడాడు.
వేలం ఎప్పుడు జరుగుతుంది?
IPL 2026 మినీ వేలం డిసెంబర్ 13-15 మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. BCCI ఇప్పటివరకు వేలం తేదీని ఖరారు చేయలేదు. నవంబర్ 15 నాటికి తమ రిటెన్షన్ జాబితాను సమర్పించాలని ఫ్రాంచైజీలకు సూచించినట్లు సమాచారం. IPL 2025 మెగా వేలం కంటే ఈసారి వేలం సాధారణ స్థాయిలో జరగనుంది.





















