India Record VS WI in 2nd Test: 65 ఏళ్ల తర్వాత టీమిండియా రేర్ ఫీట్.. విండీస్ పై బ్యాటింగ్ లో దీటైన ప్రదర్శన.. పట్టుబిగిస్తున్న గిల్ సేన
విండీస్ పై 65 ఏళ్ల తర్వాత ఒక ఫీట్ ను టీమిండియా సాధించింది. ఇక రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బ్యాటర్లు రాణించడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా.. బౌలింగ్ లోనూ సత్తా చాటింది.

Ind VS wi 2nd test latest News: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రేర్ ఫీట్ ను సాధించింది. తొలి ఐదు వికెట్లకు కనీసం 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఘనతను దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్ ను ఐదు వికెట్లకు 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (258 బంతుల్లో 175, 22 ఫోర్లు) కొద్దిలో డబుల్ సెంచరీని మిస్సయ్యాడు. కెప్టెన్ శుభమాన్ గిల్ (196 బంతుల్లో 129 నాటౌట్, 16 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్ లో పదో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (38), జైస్వాల్ తొలి వికెట్ కు 58 పరుగులు జోడించారు. ఇక రెండో వికెట్ కు జైస్వాల్ - సాయి సుదర్శన్ (87) ద్వయం 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మూడో వికెట్ కు గిల్-జైస్వాల్ జంట 74 పరుగులను జత చేసింది. అనంతరం నాలుగో వికెట్ కు తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (43) తో కలిసి గిల్ 91 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం ఐదో వికెట్ కు ధ్రువ్ జురేల్ (44) తో కలిసి గిల్ 102 పరుగుల భారీ పార్ట్నర్ షిప్ నమోదు చేసిన తర్వాత జురేల్ ఔట్ కావడంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
చరిత్రలో మూడోసారి..
ఇలా టాపార్డర్ లోని తొలి ఐదు వికెట్లకు కనీసం 50 పరుగుల చొప్పున జత చేయడం భారత్ కిది మూడోసారి కావడం విశేషం. 1993లో ముంబైలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ పై ఇదే ఫీట్ ను తొలిసారి నమోదు చేసింది. ఆ తర్వాత 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో మరోసారి ఇదే ఫీట్ ను రిపీట్ చేసింది. తాజా టెస్టులో ముచ్చటగా మూడోసారి ఈ ఘనత దక్కించుకుంది. ఇక వెస్టిండీస్ పై ఇలాంటి ఫీట్ ను చివరిసారిగా ఆస్ట్రేలియా నమోదు చేసింది. 1960లో గబ్బాలో జరిగిన ఫేమస్ టై టెస్టులో ఆస్ట్రేలియా ఇలాగే తొలి ఐదు వికెట్లకు కనీసం 50 పరుగులు జత చేసింది. దీంతో వెస్టిండీస్ పై 65 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీట్ ను నమోదు చేసిన జట్టుగా ఇండియా రికార్డులకెక్కింది.
పట్టు బిగించిన ఇండియా..
ఇప్పటికే తొలి టెస్టును ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శనివారం రెండో రోజు ఆటముగిసే సరికి వెస్టిండీస్ 43 ఓవర్లలో నాలుగు వికెట్లకు 140 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ ఆలిక్ అతనాజ్ (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్రీజులో షాయ్ హోప్ (31 బ్యాటింగ్), వికెట్ కీపర్ బ్యాటర్ టెవిన్ ఇమ్లాచ్ (14 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 378 పరుగుల వెనుకంజలో విండీస్ నిలిచింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు దక్కాయి. కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు తొలి ఇన్నింగ్సు ను 578-5 వద్ద భారత్ డిక్లేర్ చేసింది. జోమెల్ వర్రీకాన్ కు మూడు వికెట్లు దక్కాయి.




















