JoshuaBell: రోడ్డుపై 29 కోట్ల వయోలిన్, అయినా ఎవరూ పట్టించుకోలేదు? ప్రతిభకు వేదిక ఎంతవరకూ అవసరం?
Motivational Story in Telugu: ప్రతిభను గుర్తించడానికి సరైన స్థలం, వ్యక్తులు అవసరం. అందుకు ఉదాహరణే ఈ కథ...

Joshua Bell Motivation Story: అది శుభసమయం, శుభోదయం...
2007 సంవత్సరం..
వాషింగ్టన్ డిసి వీధిలో ఉదయం చలి చలిగా ఉంది
సబ్‌వే స్టేషన్ దగ్గర గోడలకు ఆనుకుని ఓ వ్యక్తి నిల్చున్నాడు
చేతిలో వయోలిన్ ఉంది..ముఖం చాలా ప్రశాంతంగా ఉంది
అక్కడే నిల్చుని...ఆ రోడ్డుపై హడావుడిగా తిరుగుతున్న జనాన్ని చూస్తున్నాడు
కాసేపటి వరకూ సైలెంట్ గా నిల్చుని... ఆ తర్వాత వయోలిన్ వాయించడం ప్రారంభించాడు
అత్యంత మనోహరమైన సంగీతం...ప్రశాంతమైన ఉదయాన్ని మరింత అందంగా మార్చేసింది...
రోడ్డుపై అటు ఇటు తిరిగేవారంతా ఆ వ్యక్తిని చూస్తూ.. శ్రావ్యమైన సంగీతం వింటూ వెళ్లిపోతున్నారు
వయోలిన్ నుంచి వెలువడే సంగీతం మనోహరంగా ఉంది.. ప్రతి నోట్ పరిపూర్ణంగా మధురంగా ఉంది.
ఆ సంగీతకారుడు వయోలిన్ వాయిస్తూ దాదాపు 45 నిమిషాలు అక్కడే ఉన్నాడు
వందల మంది నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు..ఎవరూ ఆగి వినేందుకు ఇష్టపడలేదు
ఏడుగురు మాత్రమే నిల్చున్నారు..
ఆ రోజు ఆ వ్యక్తి సంపాదన మొత్తం 2700 రూపాయలు...
ఓ వీధి కళాకారుడికి ఇది మంచి మొత్తమే..
కానీ ఈ కథలో ట్విస్ట్ ఉంది...
వీధి మధ్యలో వయోలిన్ వాయించే వ్యక్తి సాధారణ సంగీతకారుడు కాదు...తన దగ్గరున్నది సాధారణ వయోలిన్ కాదు.. అది సాధారణ ఉదయం కాదు
అక్కడ వయోలిన్ వాయిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా?
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సంగీత స్వరకర్తలలో ఒకరైన జోహన్ సెబాస్టియన్ బాచ్ శ్రావ్యతను వాయిస్తున్న జోషువా బెల్.
జోషువా బెల్ ప్రపంచంలోని గొప్ప వయోలిన్ వాద్యకారులలో ఒకరు.. గ్రామీ అవార్డు విజేత. ఆయన ప్రదర్శనల టిక్కెట్ రేట్ లక్షల్లో ఉంటాయి. అప్పటికి రెండు రోజుల క్రితం జోషువా బెల్ బోస్టన్ థియేటర్‌లో రెండు రాత్రులు ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శనకు హాజరైన ప్రతి ఒక్కరూ.. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు... చప్పట్ల తో ఆడిటోరియం మారుమోగిపోయింది
ఈ కథలో ఆలోచించాల్సిన విషయం?
ఈ చిన్న కథ వినడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు..కానీ దాని వెనుక ఉన్న ఆంతర్యం తప్పనిసరిగా మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది.
అదేంటంటే?
వ్యక్తి నైపుణ్యం... అదే సంగీతం... 29 కోట్ల విలువైన వయోలిన్... రెండు రోజుల క్రితం ప్రదర్శన ఇచ్చింది అదే వ్యక్తి, అదే వయోలిన్... రోడ్డుపై ప్రదర్శన
మరి అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి?
దీనికి సమాధానం కేవలం ప్రదేశం...
వాషింగ్టన్ పోస్ట్ నిర్వహించిన ఇది ఒక సామాజిక ప్రయోగం... ప్రజలు నిజమైన ప్రతిభను (టాలెంట్) గౌరవిస్తారా అని తెలుసుకోవడంలో భాగమే.
ఈ కథ నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే.. నైపుణ్యం కలిగి ఉండటం సరిపోదు.... మీ విలువ సరైన వ్యక్తులకు , సరైన ప్రదేశానికి చేరడం ముఖ్యం.
అంటే జీవితంలో సరైన వేదికను ఎంచుకోవడం.. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం ఎంత ముఖ్యమో ... మీరు సరైన ప్రదేశంలో సరైన వ్యక్తుల ముందు ఉన్నప్పుడే మీ అసలు విలువ కనిపిస్తుందని గుర్తుంచుకోండి.
జోషువా బెల్...ఇండియానా రాష్ట్రంలో బ్లూమింగ్టన్‌లో నలుగురు సోదరులలో ఒకడిగా జన్మించాడు జోషువా బెల్. తల్లి షిర్లీ బెల్ థెరపిస్ట్, తండ్రి అలాన్ పి. బెల్ ఇండియానా యూనివర్సిటీలో ప్రొఫెసర్. తండ్రి స్కాట్లాండ్ వంశం, తల్లి జ్యూయిష్ మూలాలు. నాలుగు సంవత్సరాల వయసులో వయొలిన్ ప్రాక్టీస్ ప్రారంభించాడు...6 సంవత్సరాల వయసులో టెన్నిస్ జాతీయ టోర్నీలలో పార్టిసిప్ చేశాడు. మొదటి గురువులు: డోనా బ్రిచ్ట్, మిమి జ్విగ్, జోసెఫ్ గింగోల్డ్. 12 సంవత్సరాల వయసులో ఫిలడెల్ఫియా ఆర్కెస్ట్రాతో సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 1984లో బ్లూమింగ్టన్ హై స్కూల్ నార్త్ నుంచి గ్రాడ్యుయేట్, 1989లో ఇండియానా యూనివర్సిటీ జాకబ్స్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి ఆర్టిస్ట్ డిప్లొమా పొందాడు. 17 సంవత్సరాల వయసులో 1985లో మొదటి ప్రదర్శన ఇచ్చాడు.





















