RCB Batter: 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన ఆర్సీబీ బ్యాటర్! ఫుల్‌టాస్‌గా వచ్చిన ఆరో బంతిని ఏం చేశాడంటే!
RCB Batter: ఇప్పటి వరకు యువరాజ్ సింగ్, హర్షలే గిబ్స్, పొలార్డ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్రలో నిలిచారు. అవకాశం వచ్చినా అలాంటి ఘనతను త్రుటిలో చేజార్చుకున్నాడు ఓ ఆర్సీబీ బ్యాటర్!
RCB Batter:
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఇద్దరే బాదిన రికార్డు! అరంగేట్రం టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హీరో యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు దంచికొట్టాడు. అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హర్షలే గిబ్స్ అదుర్స్ అనిపించాడు. ఆ తర్వాత బైలేట్రల్ సిరీసుల్లో కీరన్ పొలార్డ్, జస్కరన్ మల్హోత్ర ఒకే ఓవర్లో ఆరు మాగ్జిమమ్స్ బాదేశారు. అవకాశం వచ్చినా అలాంటి ఘనతను త్రుటిలో చేజార్చుకున్నాడు ఓ ఆర్సీబీ బ్యాటర్!
ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో రూ.3.2 కోట్లకు అతడిని తీసుకుంది. అయితే ఈ ఏడాది మీర్పూరులో బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో అతడు గాయపడ్డాడు. కండరాల గాయంతో సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. అయితే వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో అదరగొడుతుతున్నాడు. గురువారం సర్రే తరఫున మిడెలెక్స్‌పై దంచికొట్టాడు.
5 consecutive sixes by Will Jacks in a single over.
— Johns. (@CricCrazyJohns) June 22, 2023
RCB player to watch out in IPL 2024.pic.twitter.com/L6hc1r7UWe
హాల్‌మ్యాన్ వేసిన ఇన్నింగ్స్ పదకొండో ఓవోర్లో విల్ జాక్స్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదేశాడు. బౌలర్‌కు చుక్కలు చూపించాడు. అతడి ఊపుకు ఆరో బంతికీ సిక్సర్ బాదేలా కనిపించాడు. అదృష్టం కొద్దీ అతడికి ఊరించే బంతే వచ్చింది. హాల్‌మ్యాన్ హై ఫుల్‌టాస్ బంతి వేశాడు. లాంగాన్‌లో ఆడబోయిన జాక్స్ మిస్‌టైమ్ అవ్వడం వల్ల కేవలం సింగిల్‌కు పరిమితం అయ్యాడు. దాంతో అతడి ముఖంలో నిరాశ కనిపించింది. కామెంటేటర్లు సైతం.. అలాంటి బంతి వచ్చినప్పుడు అవకాశం మిస్ చేసుకున్నాడే...! అని నిట్టూర్చారు.
ఈ మ్యాచులో విల్‌జాక్స్ 45 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అతడికి తోడుగా లారీ ఇవాన్స్ 37 బంతుల్లో 85 పరుగులు చేయడంతో సర్రే 252/7తో నిలిచింది. ఓవల్ మైదానంలో విచిత్రంగా ఈస్కోరును మిడిలెక్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెప్టెన్ స్టీఫెన్ ఎస్కినాజి 39 బంతుల్లో 73, మాక్స్ హోల్డెన్ 38 బంతుల్లో 65 పరుగులతో తమ జట్టును గెలిపించుకున్నారు.
విల్‌జాక్స్ ఈ ఏడాదే ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. పాకిస్థాన్‌పై మొదటి టీ20, టెస్టు మ్యాచులు ఆడాడు. అంతకు ముందే బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డెబ్యూ చేశాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial