Ranji Trophy 2024: చెలరేగిన రాహుల్, తిలక్‌వర్మ -హైదరాబాద్ భారీ స్కోరు
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ రాణించింది. గహ్లోత్ రాహుల్ సింగ్ డబల్ సెంచరీ, టీమిండియ యువ బ్యాటర్ తిలక్ వర్మ భారీ సెంచరీలతో చెలరేగారు.
Tilak Varma In Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24(Ranji Trophy 2024) సీజన్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ రాణించింది. గహ్లోత్ రాహుల్ సింగ్( Gahlaut Rahul Singh) డబల్ సెంచరీ, టీమిండియ యువ బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma) భారీ సెంచరీలతో చెలరేగడంతో... హైదరాబాద్ తొలి రోజు 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగుల భారీ స్కోరు చేసింది. నాగాలాండ్(Nagaland)తో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్(Hyderabad)టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలో హైదరాబాద్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 2 పరుగుల వద్ద అవుటయ్యాడు. అనంతరం గహ్లోత్ రాహుల్ సింగ్, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ నాగాలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్‌సింగ్ చెలరేగిపోయాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన రాహుల్‌సింగ్... 157 బంతుల్లో 136కు పైగా స్ట్రైక్‌రేటుతో 214 పరుగులు సాధించాడు. రాహుల్ సింగ్ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ తన్మయ్ కూడా 80 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ అవుటయ్యాక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. పట్టుదలగా నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. 112 బంతుల్లోనే ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో తిలక్ వర్మ శతకం పూర్తి చేసుకున్నాడు. తిలక్‌వర్మకు తోడుగా తెలుకపల్లి రవితేజ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. నాగాలాండ్ బౌలర్లలో కరుణ్ తెవాటియా, నగాహో చిషి, ఇమ్లివటి లెమ్టూర్, క్రెవిస్టో కెన్సె, కెప్టెన్ రొంగ్సెన్ జొనాథన్ ఒక్కో వికెట్ తీశారు.
నిలబడ్డ రింకూసింగ్
టీమ్‌ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే స్టాండ్స్‌లోని అభిమానులు 'రింకూ.. రింకూ.. రింకూ' అంటూ నినాదాలు చేస్తున్నారు. టీమిండియా నయా ఫినిషర్‌గా పేరుగాంచిన రింకూసింగ్‌పై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. టీ 20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ రింకూపై భారీ ఆశలు ఉన్నాయి. ఇప్పుడు టెస్టుల్లో కూడా రాణిస్తూ ఆశలు పెంచుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో కేరళతో మొదలైన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తరపున బరిలోకి దిగిన రింకూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 103 బంతుల్లో 7 ఫోర్లు... 2 సిక్సర్ల సాయంతో రింకూ 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన ఉత్తర ప్రదేశ్ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో బరిలోకి దిగిన రింకూ.. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. దృవ్ జురెల్‌తో కలిసి రింకూ 100 పరుగుల అజేయమైన, విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు.
చరిత్ర సృష్టించిన వైభవ్
దేశవాళీ అత్యున్నత క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలోకి బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ రంజీల్లోకి అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ముంబైతో మొదలైన మ్యాచ్‌లో బీహార్ తరఫున వైభవ్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన వైభవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్ పేరిట ఉంది.