Rahmanullah Gurbaz: గుర్బాజ్ మెరుపుల వెనక కింగ్ కోహ్లీ, అఫ్ఘాన్ బ్యాటర్ ఏం చెప్పాడంటే!
Rahmanullah Gurbaz: బ్రిటీష్ బౌలర్లను ఊచకోత కోసిన గుర్బాజ్ బ్యాటింగ్ మెరుపుల వెనక మన కింగ్ ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్బాజే స్వయంగా వెల్లడించాడు.
ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఓడించి అఫ్గానిస్తాన్ పెను సంచలనం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 57 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. గుర్బాజ్ బ్యాట్ నుంచి 8 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి. బ్రిటీష్ బౌలర్లను ఊచకోత కోసిన గుర్బాజ్ బ్యాటింగ్ మెరుపుల వెనక మన కింగ్ ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్బాజే స్వయంగా వెల్లడించాడు.
మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేసిన తర్వాత గుర్బాజ్.. తన అద్భుత ఇన్నింగ్స్‌కు కోహ్లీ ఎలా సహకరించాడో చెప్పాడు. ప్రపంచంలోని ప్రతి యువ ఆటగాడికి కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తాడని గుర్బాజ్ అన్నాడు. కోహ్లీ తనకు గేమ్ ప్లాన్ గురించి, ఇన్నింగ్స్‌ని ఎలా నిర్మించడం గురించి.. మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడం గురింంచి పలు సూచనలు చేశాడని గుర్బాజ్ తెలిపాడు. తన బ్యాటింగ్ నైపుణ్యంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడని వెల్లడించాడు. కోహ్లీ ఇచ్చిన విలువైన సలహాలతో తన బ్యాటింగ్‌ను మెరుగు పెట్టుకున్నట్లు గుర్బాజ్ తెలిపాడు. కోహ్లీ అందరిలోనూ స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగుతాడని పొగడ్తల వర్షం కురిపించాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి తమ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. గుర్బాజ్-జద్రాన్ జోడీ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించిన అనంతరం జద్రాన్ ఔటయ్యాడు. గుర్బాజ్ మెరుపులతో అఫ్గాన్ ఓ దశలో వికెట్ కోల్పోకుండా 12.4 ఓవర్లకే 100 పరుగులు చేసింది. గుర్బాజ్ ప్రారంభం నుంచి హిట్టింగ్‍కు దిగాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుపడ్డాడు. గుర్బాజ్ దూకుడుతో 10 ఓవర్లలోనే అఫ్గానిస్థాన్ 79 పరుగులు చేసింది. మరో ఎండ్‍లో జర్దాన్ నిలకడగా ఆడాడు. అదే జోరు కొనసాగించిన గుర్బాజ్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న గుర్బాజ్ రనౌట్ అవడంతో సెంచరీ చేయలేకపోయాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచి అఫ్గాన్ పెను సంచలనం నమోదు చేసింది. ఇంగ్లాండ్‌పై అఫ్ఘానిస్థాన్ 69 పరుగుల భారీ తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్ఘానిస్థాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (80: 57 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇక్రమ్ అలిఖిల్ (58: 66 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (66: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. కానీ అతని వన్ మ్యాన్ షో సరిపోలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు సాధించారు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. 40.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.