Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులు భారీ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించతలపెట్టాయి.
Varanasi Stadium: పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథుడి చెంతన క్రికెట్ స్డేడియం నిర్మితం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో అత్యాధునిక సౌకర్యాలతో సుమారు రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో భారీ క్రికెట్ స్టేడియాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్తంగా నిర్మించనున్నాయి. స్వయంగా మోడీనే ఈ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 23న (శనివారం) మోడీతో పాటు భారత క్రికెట్‌లోని అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
డమరుకం పెవిలియన్.. త్రిశూలం ఫ్లడ్ లైట్స్
కాశీ పుణ్యక్షేత్రం అంటేనే శివ భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన ప్రదేశం. ఇక్కడ బీసీసీఐ నిర్మించబోయే స్టేడియంలోనూ శివతత్వం ఉట్టిపడేలా చేపట్టనున్నారు. శివుడి చేతిలో మోగే డమరుకం రూపంలో ఉండే పెవిలియన్.. త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్ లైట్లు, గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకులు గ్యాలరీ ఉండనుంది. సుమారు 30 వేల మంది సీటింగ్ సామర్థ్యంతో ఈ స్టేడియం నిర్మితం కానుంది. స్టేడియం ప్రవేశ ద్వారం బిల్వ పత్రం వలే ఉండనుంది. పూర్తిగా శివతత్వం ఉట్టిపడేలా ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
Renders of the upcoming Cricket Stadium in Varanasi, Uttar Pradesh.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2023
PM Narendra Modi will lay the foundation on 23rd September. pic.twitter.com/GLTTM6kgZw
వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలోని గంజరి అనే గ్రామంలో ఈ స్టేడియం నిర్మితంకానుంది. ఈ భారీ స్టేడియం కోసం రూ. 450 కోట్లు అంచనా వ్యయం కాగా భూసేకరణ కోసం ఇదివరకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 121 కోట్లు వెచ్చించింది. బీసీసీఐ రూ. 330 కోట్లు వెచ్చించి స్టేడియం నిర్మాణం చేపడుతుంది. దీని నిర్మాణానికి గాను ప్రముఖ సంస్థ ఎల్ అండ్ టీ కాంట్రాక్టు దక్కించుకుంది.
మోడీ చేతులమీదుగా..
వారణాసి స్టేడియం భూమిపూజ కార్యక్రమానికి గాను నరేంద్ర మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, భారత క్రికెట్ దిగ్గజాలు హాజరుకానున్నారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, గుండప్ప విశ్వనాథ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షాలు హాజరవుతారు. వారణిసి స్టేడియానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం విదితమే.
The new stadium in Varanasi will be themed after Lord Shiva:
— Siddharth Bakaria (@SidBakaria) September 20, 2023
- The stadium's dome will resemble a damaru
- The floodlights will be shaped like trishuls
- The entrance gate will be designed like a bilva leaf.
Har Har Mahadev!" pic.twitter.com/I2VwYENRN3
ఉత్తరప్రదేశ్‌లో గతంలో కాన్పూర్ ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా ఉండేది. ఆ తర్వాత ఇటీవల కాలంలో లక్నోలో ఏకనా స్టేడియం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే విస్తీర్ణంగా పెద్ద రాష్ట్రమైన యూపీలో పూర్వాంచల్ ప్రజలు క్రికెట్ మ్యాచ్‌లు చూడాలంటే సాహసంతో కూడుకున్నదే. కానీ మరో రెండు సంవత్సరాలలో వారి కల నెరవేరనుంది.