Pakistani Cricketer Haider Ali: పాకిస్తానీ క్రికెటర్ హైదర్ అలీ అరెస్ట్.. అత్యాచారం కేసులో చిక్కుకున్న యువ ఆటగాడు! అసలేం జరిగింది?
Pakistani Cricketer Haider Ali: పాకిస్తాన్‌కు చెందిన క్రికెటర్ హైదర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం కేసులో అతన్ని ఇంగ్లండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Pakistani Cricketer Haider Ali: పాకిస్తానీ క్రికెటర్ హైదర్ అలీని అత్యాచారం కేసులో భాగంగా గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్టు చేశారు. అతను పాకిస్తాన్ A జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లాండ్ లయన్స్‌తో ఆడటానికి వెళ్ళాడు. మాంచెస్టర్ పోలీసులు Reutersకి ఇమెయిల్ ద్వారా, "సోమవారం, ఆగస్టు 4, 2025న అత్యాచారం గురించి ఫిర్యాదు అందిన తర్వాత, మేము 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశాము" అని తెలిపారు.
పాకిస్తానీ క్రికెటర్ హైదర్ అలీ 2 అక్టోబర్ 2000న పాకిస్తాన్ పంజాబ్‌లో జన్మించాడు. 24 ఏళ్ల ఈ క్రికెటర్ పాకిస్తాన్ తరపున వన్డే, టీ20లలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు, అతను భారత్‌తో జరిగిన ప్రపంచ కప్‌లో మ్యాచ్ ఆడాడు. అతనికి ఆటలో రోహిత్ శర్మ ఆదర్శమని చెబుతుంటాడు. అతను PSLలో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడతాడు. 2023లో ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ డెర్బీషైర్‌లో ఆడాడు.
క్రికెటర్ హైదర్ అలీ ఎవరు?
హైదర్ అలీ 2 అక్టోబర్ 2000న పాకిస్తాన్ పంజాబ్‌లోని అటాక్‌లో జన్మించాడు, అతని తండ్రి భూస్వామి. అతని సోదరుడు రావల్పిండి రామ్స్ తరఫున ఆడాడు. 2015లో హైదర్ టేప్ బాల్ క్రికెట్‌తో తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు, కొన్ని నెలల తర్వాత అతను అల్ ఫైసల్ క్రికెట్ క్లబ్‌లో చేరాడు.
హైదర్ అలీ సెప్టెంబర్ 2019లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. తర్వాత ఏడాది అంటే సెప్టెంబర్ 1, 2020న అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. వికీపీడియా ప్రకారం, అలీ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మను తన ఆదర్శంగా తీసుకుంటాడని తెలుస్తోంది.
భారత్‌తో జరిగిన ప్రపంచ కప్‌లో హైదర్ అలీ ఆడాడు
హైదర్ అలీ 35 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో భారత్‌తో కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు, అది కూడా ప్రపంచ కప్‌లో. అతను 23 అక్టోబర్ 2022న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడాడు. అయితే, అతను అందులో సరిగా ఫెర్ఫార్మ్‌చేయలేకపోయాడు. అతను కేవలం 2 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ 82 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
హైదర్ అలీ క్రికెట్ కెరీర్
అలీ నవంబర్ 1, 2020న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తన వన్డే అరంగేట్రం చేశాడు. దీనికి ముందు, సెప్టెంబర్ 1, 2020న, అతను ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్‌లో టీ20 అరంగేట్రం చేశాడు. అతను 2023లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు, అయితే అతను త్వరలో జాతీయ జట్టులోకి తిరిగి వస్తాడని భావించారు, కాని అంతకు ముందే అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. దీని తరువాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ పూర్తయ్యే వరకు అతన్ని సస్పెండ్ చేసింది.
హైదర్ అలీ 2 వన్డే మ్యాచ్‌లలో మొత్తం 42 పరుగులు చేశాడు. 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 32 ఇన్నింగ్స్‌లలో అలీ 124.69 స్ట్రైక్ రేట్‌తో 505 పరుగులు చేశాడు, ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.




















