MS Dhoni: ఇప్పుడున్న తోపులెవరూ కాదు, వరల్డ్ నెంబర్ వన్ కెప్టెన్ ధోనీనే - పాక్ మాజీ సారథి కామెంట్స్
ఆధునిక క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని మించిన కెప్టెన్ లేడని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్..
MS Dhoni: ప్రపంచ క్రికెట్‌లో గొప్ప గొప్ప సారథులు ఎంతమంది వచ్చినా ఇప్పుడు కూడా తోపులు అనదగ్గ క్రికెటర్లు పలు జట్లలో ఉన్నా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనినే వరల్డ్ నెంబర్ వన్ కెప్టెన్ అన్నాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్. తాజాగా అతడు ప్రముఖ పాకిస్తాన్ యూట్యూబర్ నాదిర్ అలీ పోడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గడిచిన పదిహేనేండ్లలో ప్రపంచ క్రికెట్‌లో ధోనీని మించిన సారథి మరెవరూ రాలేదని భట్ చెప్పాడు.
భట్ మాట్లాడుతూ..‘మీరు క్రికెట్‌లో గడిచిన పదిహేనేండ్ల చరిత్ర చూస్తే మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగాడు.
అతడు నెంబర్ వన్ కెప్టెన్. ధోని ఫీల్డ్‌లో ఎవరిమీ అరవడం గానీ దురుసుగా ప్రవర్తించడం వంటివి చేసిన దాఖలాలు లేవు. తన టీమ్‌మేట్స్ మీద కూడా అరిచిన సందర్భాలు లేవు. మ్యాచ్ లేదా ఏదైనా టోర్నీ గెలిస్తే తన టీమ్ మొత్తం సెలబ్రేట్ చేసుకున్నా ధోని మాత్రం కామ్‌గా ఎక్కడో దూరంగా నిలుచుంటాడు..’ అని ప్రశంసలు కురిపించాడు.
కాగా సుమారు పదేండ్ల పాటు భారత జట్టును నడిపించిన ధోని రికార్డు స్థాయిలో ఏకంగా 332 మ్యాచ్ (అన్ని ఫార్మాట్లలో కలిసి) లలో టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో భారత జట్టు 178 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. 2020 ఆగస్టులో ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథిగా ఉన్నాడు. మే లో ముగిసిన ఐపీఎల్-16లో చెన్నై సారథిగా ఐదో ట్రోఫీని అందుకున్నాడు.
టీమిండియాకు సూచనలు..
వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు కూర్పు ఎలా ఉండాలనేదానిపై కూడా సల్మాన్ భట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్లలో ఎవరూ వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ దరిదాపుల్లో కూడా లేరని, అతడు శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని భట్ సూచించాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో అనుభవం కలిగిన ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉందని, శిఖర్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని భట్ చెప్పుకొచ్చాడు. గిల్, ధావన్‌లు ఓపెనర్లుగా వచ్చి రోహిత్ వన్ డౌన్‌లో వస్తే అది భారత జట్టు కూర్పునకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు. ఒకవేళ రోహిత్ - శిఖర్‌లు ఓపెనర్లుగా వస్తే గిల్‌ను వన్ డౌన్‌లో పంపొచ్చని సూచించాడు. ఆరో స్థానంలో కెఎల్ రాహుల్‌ను గానీ టెస్టులలో ఆడే అజింక్యా రహానేను గానీ ఆడించడం బెటర్ అని భట్ సూచించడం గమనార్హం. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు యువ ఆటగాళ్లకు దానిని తట్టుకోవడం కష్టమవుతుందని.. అనుభవం కలిగిన సీనియర్ ఆటగాళ్లైతే ఒత్తిడిని అధిగమంచి ఆడతారని తెలిపాడు. అయితే భట్ చెప్పినట్టు కెఎల్ రాహుల్‌ను ఆరో స్థానంలో ఆడించొచ్చు గానీ రహానేను వన్డే జట్టులో ఆశించడం అత్యాశే అవుతుంది. 18 నెలల తర్వాత ఇటీవలే టెస్టు జట్టులోకి వచ్చిన రహానే వెస్టిండీస్‌తో రెండు టెస్టులలోనూ విఫలమయ్యాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial