Asia Cup 2025 Ind VS Pak Latest Update: ఇండియాతో మ్యాచ్.. మళ్లీ ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాక్.. రిఫరీ నుంచి స్ట్రాంగ్ రిప్లై..!!
పాక్ పై టీ20ల్లో భారత్ తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఇరుజట్ల మధ్య 15 మ్యాచ్ లు జరుగగా ఇండియా 12-3తో ఆధిక్యంలో ఉంది. తాజాగా ఆసియాకప్ లో వరుసగా రెండుసార్లు ఆ జట్టును ఓడించింది.

Asia Cup 2025 Pakistan lodged a complaint with ICC : ఆసియాకప్ లో వారం వ్యవధిలో రెండుసార్లు వరుసగా ఇండియా చేతిలో ఓడిపోవడంతో పాకిస్తాన్ అక్కసును ప్రదర్శిస్తోంది. తాజాగా దుబాయ్ లో ఆదివారం జరిగిన సూపర్-4 లీగ్ మ్యాచ్ గురించి ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేయగా, హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పాక్ బ్యాటర్ ఫఖార్ జమాన్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. అయితే క్లీన్ క్యాచ్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, టీవీ అంపైర్ కు అంపైర్ నివేదించాడు. పలు కోణాల్లో క్యాచ్ ను పరిశీలించిన థర్డ్ అంపైర్ శ్రీలంకకు చెందిన రుచిరా పల్లియగురుగే ఆఖరుకు ఔట్ గా ప్రకటించాడు. దీనిపై ఫఖార్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెవిలియన్ కు చేరుకున్నాడు.ఈ మ్యాచ్ లో ఇండియా చేతిలో ఆరు వికెట్లతో పాక్ చిత్తుగా ఓడిపోయింది. అయితే మ్యాచ్ ముగిశాక టీవీ అంపైర్ పై మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ కు ఫిర్యాదు చేసింది.
చేతులెత్తేసిన పైక్రాఫ్ట్..
అయితే పాక్ ఫిర్యాదును గమనించిన పైక్రాఫ్ట్. . అది తన పరిధిలోకి రాదని, ఐసీసీకే నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించాడు. దీంతో పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా.. ఐసీసీకి ఈ విషయంపై ఈమెయిల్లో ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. అయినా మ్యాచ్ లో అంపైర్ల నిర్ణయాలను సవాలు చేసే వెసులుబాటు లేదని తెలుస్తోంది. ఇక ఆసియాకప్ లో ఆటతో ఇండియాను ఓడించలేమని సిల్లీ రీజన్స్ తో పాక్.. భారత్ ను బద్నాం చేయాలని బొక్కా బోర్లా పడుతోంది. తొలి మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఇవ్వలేదని రభస చేసి అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది. అలాగే మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని భీష్మ ప్రతిజ్ఞ చేసి, ఆ తర్వాత తోక ముడిచి, యూఏఈతో మ్యాచ్ ఆడింది.
సన్నాయి నొక్కులు..
మ్యాచ్ అంపైర్ నిర్ణయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఫఖార్ క్యాచ్ క్లీన్ గా లేదని పేర్కొన్నాడు. వికెట్ కీపర్ ముందు బంతి బౌన్స్ అయినట్లుగా తెలుస్తోందని, అయినా అంపైర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపాడు. అంపైర్లు కూడా పొరపాట్లు చేస్తారని, ఇదంతా ఆటలో సహజమని నిర్వేదం ప్రకటించాడు. అయితే ఫఖార్ ఔట్ కాకపోయినట్లయితే తాము మరింత భారీ స్కోరు చేసే వాళ్లమని పేర్కొన్నాడు. ఇక సూపర్ ఫోర్ లో మంగళవారం శ్రీలంకతో పాక్ తలపడుతుండగా, బుధవారం బంగ్లాదేశ్ తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇండియా దాదాపుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఈనెల 28న ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అంతకుముందు ఈనెల 26 లంకతో ఆఖరి లీగ్ మ్యాచ్ ను ఇండియా ఆడనుంది. ఇక లంకపై ఓడిపోతే, పాక్ ఇంటిముఖం పట్టడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఈ మ్యాచ్ కు పాక్ కు చావోరేవో కానుంది. మరవైపు లంకకు కూడా ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే కావడం విశేషం.




















