Javed Miandadad: ఇమ్రాన్ ఖాన్ ను ప్రధాని చేసి తప్పు చేశా - అతడికి కృతజ్ఞతాభావం లేదు: జావేద్ మియందాద్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆయన మాజీ సహచర ఆటగాడు జావేద్ మియందాద్ సంచలన ఆరోపణలు చేశాడు.
Javed Miandadad: పాకిస్తాన్ బ్యాటింగ్ దిగ్గజం జావేద్ మియందాద్, తాను క్రికెట్ ఆడినప్పుడు తనకు సారథిగా వ్యవహరించిన పాక్ లెజెండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇమ్రాన్ ను ప్రధాని చేసి తాను తప్పు చేశానని వాపోయాడు. ఇమ్రాన్ లో కృతజ్ఞతాభావం లేదని, కనీసం తనకు థ్యాంక్స్ కూడా చెప్పలేదని మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాత్రి 2 గంటలకు తలుపు కొట్టి..
పాకిస్తాన్ కు చెందిన ARY Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ గురించి మియందాద్ మాట్లాడుతూ.. ‘నేను ఈరోజు మీకు అసలు విషయం చెబుతున్నా. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడానికి నేను ఎంతగానో సాయం చేశాను. అతడి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరయ్యా. కానీ ఆ తర్వాత ఇమ్రాన్ నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అది నాకు చాలా బాధ కలిగించింది. ఇమ్రాన్ కోసం అంత చేసినా నాకు అతడు థ్యాంక్స్ కూడా చెప్పకపోవడం ఏదోలా అనిపించింది. మనం ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు తిరిగి వారిమీద కృతజ్ఞత చూపించడం కనీస బాధ్యత. అది లేనప్పుడు రాత్రి 2 గంటలకు వచ్చి నా తలుపు ఎందుకు కొట్టినట్టు..? నన్ను సాయం ఎందుకు అడిగినట్టు..?‘ అని మియందాద్ అన్నాడు.
عمران خان کو وزیراعظم میں نے بنوایا تھا، مگر جس کو شکریہ ادا کرنا چاہیے تھا وہ نہیں کیا، اب دوبارہ وزیراعظم بننا مشکل ہے ۔۔ جاوید میانداد کا انکشاف @ImranKhanPTI @Javed__Miandad #11thhour pic.twitter.com/2LIfGHNcoI
— 11th Hour ARY News (@11thhourARY) July 1, 2023
ఇమ్రాన్ ఖాన్.. 2018లో పాక్ ప్రధాని అయ్యాడు. అతడు నెలకొల్పిన తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ పార్టీ 2018 పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్ లో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టును విజయవంతంగా నడిపిన ఇమ్రాన్.. దేశ ప్రధానిగా ఆ ముద్ర వేయలేకపోయాడు. పార్టీలో అంతర్గత కలహాలు, దేశంలో పెరిగిన నిత్యావసరాల ధరలు, ఇతరత్రా సమస్యలతో ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు. నాలుగేండ్లు కూడా పాలించకుండానే ఇమ్రాన్ ఖాన్.. గతేడాది నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంలో మెజారిటీని నిరూపించుకోలేకపోయాడు. తద్వారా ఆయన ప్రధాని పదవిని కోల్పోయాడు.
1992 వరల్డ్ కప్ లో..
ఇప్పుడు కత్తులు దూసుకుంటున్న ఈ ఇద్దరూ గతంలో మంచి మిత్రులే. 1992 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కు తొలి వన్డే వరల్డ్ కప్ ను అందించడంలో జావేద్ మియందాద్, కెప్టెన్ ఇమ్రాన్ లదే కీలక పాత్ర. ముఖ్యంగా ఫైనల్ లో మియందాద్.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఓపెనర్లిద్దరూ 24 పరుగులకే ఔట్ అయితే ఇమ్రాన్ ఖాన్ తో కలిపి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో మియందాద్.. 98 బంతుల్లో 58 పరుగులు చేయగా ఇమ్రాన్ ఖాన్.. 110 బంతుల్లో 72 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి 139 పరుగులు జోడించడంతో పాకిస్తాన్.. ఇంగ్లాండ్ ఎదుట 250 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. బౌలింగ్ లో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ ల సంచలన స్పెల్ తో ఇంగ్లాండ్.. 227 పరుగులకే పరిమితమైంది. నాటి వరల్డ్ కప్ లో మియందాద్.. 9 మ్యాచ్ లలో 437 పరుగులు సాధించాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial