ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసింది వీళ్లే - టాప్-5లో ఇద్దరూ మనోళ్లే
క్రికెట్ కార్నివాల్ వన్డే ప్రపంచకప్‌లో సెంచరీ చేయాలని కోరుకోన బ్యాటర్ ఉండడు. మరి ఈ మెగా టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ ఎవరు..?
ODI World Cup 2023 : మరో 15 రోజులలో భారత్ వేదికగా జరగాల్సి ఉన్న వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిత్యం జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు, రెండేళ్లకోమారు జరిగే టీ20 వరల్డ్ కప్‌తో పోలిస్తే వన్డే వరల్డ్ కప్‌కు ఉండే క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించే ఈ మెగా టోర్నీలో సెంచరీలు చేయడం ఆటగాళ్లకు ముఖ్యంగా బ్యాటర్లకు ఓ కల వంటిది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన భారతీయ పిచ్‌లపై పరుగుల పండుగ చేసుకోవడానికి పది దేశాల బ్యాటర్లూ సిద్ధమవుతున్నారు. మరి వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ ఎవరు..? ఆ జాబితాలో టాప్ - 5 ఆటగాళ్ల గురించి ఇక్కడ చూద్దాం..
5. డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డేలలో మోస్ట్ అటాకింగ్ ఓపెనర్లలో ఒకడు. క్రీజులో కుదురుకున్నాడంటే ఓ పట్టాన ఔట్ కాడు. భారీ స్కోర్లు చేయడంలో దిట్ట అయిన వార్నర్ భాయ్ ఇప్పటివరకూ రెండు వన్డే వరల్డ్ కప్‌లు ఆడాడు. త్వరలో ఆడబోయేది అతడికి మూడో ప్రపంచకప్. ఈ మెగా టోర్నీలో 18 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 18 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 62 సగటుతో 992 పరుగులు సాధించాడు. వార్నర్ ఖాతాలో నాలుగు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలూ ఉన్నాయి.
4. రికీ పాంటింగ్
ఆసీస్ దిగ్గజం, ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ వరల్డ్ కప్ అంటే వేరే లెవల్‌లో రెచ్చిపోయేవాడు. 2003లో భారత్‌తో ఫైనల్‌లో అతడు చేసిన సెంచరీని క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఐదు ప్రపంచకప్‌లు ఆడిన పాంటింగ్.. మొత్తంగా 46 మ్యాచ్‌లలో 42 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 1,743 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో పాంటింగ్ బ్యాటింగ్ సగటు 45.86గా ఉండగా అతడి ఖాతాలో ఐదు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలూ ఉన్నాయి.
3. కుమార సంగక్కర
శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ వికెట్ కీపర్ బ్యాటర్. వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసినవారిలో అతడి స్థానం మూడోవది. మూడు వన్డే ప్రపంచకప్‌లలో ప్రాతినిథ్యం వహించిన సంగ.. 37 మ్యాచ్‌లు ఆడి 35 ఇన్నింగ్స్‌లలో 1,532 పరుగులు సాధించాడు. ఈ లంక మాజీ సారథి బ్యాటింగ్ సగటు 56.74గా ఉండగా అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఏడు అర్థ శతకాలూ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 2015లో జరిగిన ప్రపంచకప్‌లో అతడు ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు.
2. సచిన్ టెండూల్కర్
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎవరికీ సాధ్యం కాని విధంగా తన సుదీర్ఘ కెరీర్‌లో ఏకంగా ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడాడు. ఈ మెగా టోర్నీలలో 45 మ్యాచ్‌లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్.. 44 ఇన్నింగ్స్‌లలో 56.75 సగటుతో 2,278 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌లో సచిన్‌కు దరిదాపుల్లో ఉన్న క్రికెటర్లు (మాజీలే కాదు, ప్రస్తుత తరంలోనూ) కూడా ఎవరూ లేరు. సచిన్ ఖాతాలో ఆరు శతకాలు, ఏకంగా 15 అర్థ సెంచరీలూ ఉన్నాయి.
1. రోహిత్ శర్మ
టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆడింది రెండు ప్రపంచకప్‌లే అయినా ఘనాపాఠీలకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అంటేనే అదేదో శక్తి ఆవహించినట్టుగా ఆడే హిట్‌మ్యాన్ ఖాతాలో ఆరు శతకాలు ఉన్నాయి. ఒక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ కూడా రోహితే. 2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. తద్వారా కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్‌లో ఒక్క సెంచరీ చేయడానికే నానా తంటాలు పడే ఆటగాళ్లు రోహిత్ విశ్వరూపాన్ని చూసి విస్తుపోయారు. రెండు ప్రపంచకప్‌లలో 17 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. 65.20 సగటు (ఈ విషయంలో రోహిత్ అందరికంటే టాప్‌లో ఉన్నాడు)తో 978 పరుగులు సాధించాడు. రోహిత్ ఖాతాలో 6 సెంచరీలతో పాటు మూడు అర్థ శతకాలూ ఉన్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో పైన పేర్కొన్నవారేగాక నాలుగు సెంచరీలు చేసినవారిలో గంగూలీ, డివిలియర్స్, మార్క్ వా, తిలకరత్నే దిల్షాన్, జయవర్దెనే ఉన్నారు. భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు సెంచరీలు సాధించాడు.