AUS Vs SA, Innings Highlights: డికాక్ సూపర్ సెంచరీ - ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం ఉంచిన దక్షిణాఫ్రికా!
AUS Vs SA Innings Highlights: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది.
వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు కొట్టింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవరల్లో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (109: 106 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లు) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా విజయానికి 300 బంతుల్లో 312 పరుగులు చేయాల్సి ఉంది.
అదరగొట్టిన డికాక్, మార్క్రమ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు క్వింటన్ డికాక్, టెంబా బవుమా ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడారు. మొదటి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సరికి ప్రొటీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. 15 ఓవర్ల తర్వాత వీరు కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. క్వింటన్ డికాక్ ఒక్కసారిగా గేర్లు మార్చాడు. బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 51 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి వికెట్‌కు 108 పరుగులు జోడించిన అనంతరం గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బవుమా అవుటయ్యాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన రాసీ వాన్ డర్ డుసెన్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. వాన్ డర్ డుసెన్‌ను అవుట్ చేసి జంపా ఆస్ట్రేలియాకు రెండో వికెట్ అందించాడు. వికెట్ పడ్డప్పటికీ డికాక్ దూకుడు ఆగలేదు. ఇన్నింగ్స్‌లో వేగం తగ్గలేదు. 91 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే కీలక సమయంలో క్వింటన్ డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాకు మూడో వికెట్ అందించాడు.
కానీ ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జానెన్ ఇన్నింగ్స్ వేగం తగ్గకుండా చూశారు. దీని కారణంగా ఒక పక్క వికెట్లు పడుతున్నా దక్షిణాఫ్రికా రన్ రేట్ ఏమాత్రం తగ్గలేదు. ఎయిడెన్ మార్క్రమ్ 41 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి 10 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 79 పరుగులు చేసింది. దీంతో 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial