Andhra Premier League Updates: ఏపీఎల్‌లో 15.6 లక్షలా? నితీషా మాజాకా!
Nitish Kumar Reddy: SRH ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి జాక్ పాట్ కొట్టాడు. ఏపీఎల్ వేలంలో గోదావరి టైటాన్స్ జట్టు రూ. 15.6 లక్షలకు కొనుగోలు చేసింది. ఏపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక మొత్తం అవ్వడం గమనార్హం.
APL 2024 News: ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున సత్తా చాటిన విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి జాక్‌పాట్ కొట్టాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరుగనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన వేలంలో నితీష్‌ని ఓ టీమ్ అత్యధిక ధరకు కొనుగోలు చేసింది.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ఆధ్వర్యంలో త్వరలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ ప్రారంభం కాబోతోంది. జూన్ 30 నుంచి జూలై 13 వరకు జరిగే ఈ మూడో సీజన్ లో పాల్గొనే ఆరు జట్ల కోసం గురువారం విశాఖ పట్నంలో మినీ వేలం నిర్వహించారు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరబాద్ తరఫున సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డికి ఈ ఏపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం 15.60 లక్షలు లభించాయి.
ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్వహించిన ఈ మినీ వేలంలో పలు స్థాయిల్లో ఆంధ్రా కు ఆడిన 408 మంది ఆటగాళ్లు, నాలుగు కేటగిరీల్లో అందుబాటులో ఉండగా.. ఆరు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ప్రతి జట్టు గతంలో తమకు ఆడిన ఏడుగురు చొప్పున ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకోగా.. మిగిలిన 13 మంది కోసం ఈ మినీ వేలం నిర్వహించారు. గోదావరి టైటన్స్ జట్టు నితీష్ కుమార్ రెడ్డిని సొంతం చేసుకుంది. గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నితీష్‌ని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో నితీష్ 7 ఇన్నింగ్స్ ఆడగా వాటిలో 239 పరుగులు చేవాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు వికెట్లు కూడా తీశాడు. దీంతో ఈ ఏడాది ఏపీఎల్ లో నితీష్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్‌గా మారాడు.
మొత్తం ఆరు ఫ్రాంచైజీలు..
ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వించిన ఏపీఎల్ తొలి రెండు సీజన్లు విజయవంతమయ్యాయి. 2022లో రోస్టల్ రైడర్స్, గతేడాది రాయలసీమ కింగ్స్ విజేతలుగా నిలిచాయి. గోదావరి టైటన్స్ తో పాటు రాయలసీమ కింగ్స్ , కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ ఇలా ఆరు ఫ్రాంచైజీలు ఈ సారి ఏపీఎల్ లో పోటీ పడుతున్నాయి. ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ లు కడప లోని వైఎస్ ఆర్ స్టేడియంలో, 12 మ్యాచులు విశాఖ లోని వైఎస్ ఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఆటగాళ్ల ప్రతిభకు వేదిక ఏపీఎల్ : గోపీనాథ్ రెడ్డి
ఇప్పటి వరకు వివిధ జోన్ స్థాయిల్లో ఆడిన వారు. తమ ప్రతిభను చాటడానికి ఏపీఎల్ చక్కటి వేదికని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాధ్ రెడ్డి చెప్పారు. మినీ వేలం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మేజర్ టోర్నీల్లో ఆడేందుకు ఒత్తిడి లేని ఆటను ప్రదర్శించడం చాలా ముఖ్యం. ఏపీఎల్ ద్వారా దాన్ని అధిగమించొచ్చు. ఐపీఎల్‌కు, జాతీయ జట్లకు ఏపీ నుంచి ఆరుగురు క్రికెటర్లతో పాటు. ఇద్దరు మహిళా క్రికెటర్లు స్థానం దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రా రెడ్డి సూచన మేరకు క్రికటర్లకు తగిన తోడ్పాటు నందిస్తున్నాం. వచ్చే సీజన్ల కల్లా మంగళగిరిలోని స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తాం’’ అని పేర్కొన్నారు.
ఒక్కో జట్టు 20 మందిని..
ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు సబ్ సెంటర్ల నుంచే కాక.. అకాడమీల ద్వారా ఎదిగిన 18 నుంచి 25 ఏళ్ల క్రికెటర్లను సైతం రైజింగ్ స్టార్స్ పేరిట ఈ వేలంలో అనుమతించినట్లు గోపీనాథ్ రెడ్డి చెప్పారు. ‘‘వేలంలొ ఫ్రాంచైజీలు 13 మంది చొప్పున కొత్తగా ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. రిటెయిన్ చేసుకున్న ఏడుగురితో కలిపి మొత్తం 20 మంది ఆటగాళ్లు ప్రతి జట్టులో ఉన్నారు. వారికి నెలన్నర పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తాం’’ అని వెల్లడించారు. ఈ సమావేశంలో గవర్నింగ్ కౌన్సిల్ ప్రతినిధి జితేంద్ర శర్మ, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కోశాధికారి చలం తదితరులు పాల్గొన్నారు.