BAN vs NED: పసి కూనల మధ్య కీలక పోరు , టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది.
ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ కీలకమైన మ్యాచ్‌కు కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ సిద్ధమైంది. సెమీఫైనల్స్ చేరాలనే ఆశలు సజీవంగా ఉండాలంటే రెండు జట్టులకి తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. మ్యాచ్ లో టాస్ గెలిచి పిచ్ రిపోర్ట్ ఆధారంగా బ్యాటింగ్ ను ఎంచుకుంది నెదర్లాండ్స్. అఫ్గానిస్తాన్‌పై విజయంతో ఈ ప్రపంచకప్‌ను ఘనంగా ఆరంభించిన బంగ్లాదేశ్ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. పసికూన నెదర్లాండ్స్‌పై విజయంతో మళ్లీ గాడిన పడాలని బంగ్లా భావిస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్... డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్... గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్, ఆతిథ్య భారత్‌తో తలపడనుంది. అగ్ర జట్లతో తలపడే ఈ మ్యాచ్‌లకు ముందు నెదర్లాండ్స్‌పై గెలిచి ఆత్మవిశ్వాసం పోగు చేసుకోవాలని బంగ్లా టైగర్స్ భావిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని భావించినా ఇప్పటివరకూ అలాంటిది జరగలేదు. బంగ్లా బౌలర్లను ప్రత్యర్థి బ్యాటర్లు ఊచకోత కోస్తుండడం ఆజట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
బంగ్లా కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ తన బ్యాటింగ్ సమస్యలను పరిష్కరించుకునేందుకు చిన్ననాటి గురువు నజ్ముల్ అబెదీన్ ఫాహిమ్‌తో కొన్ని గంటలపాటు చర్చలు జరిపారు. ప్రపంచకప్ మధ్యలో స్వదేశానికి వెళ్లి మరీ షకీబుల్ చర్చలు జరిపి వచ్చి మళ్లీ జట్టులో చేరాడు. ఈ ప్రపంచకప్‌లో షకీబ్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 56 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండూ విభాగాల్లోనూ ఘోరంగా విఫలవమవుతోంది. బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఒక్క పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోవడం బంగ్లాను ఆందోళన పరుస్తోంది. తౌహిద్ హృదయ్ కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 68 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా ఫామ్ బంగ్లాకు కలిసి వస్తోంది. ఈ ప్రపంచకప్‌లో 111 పరుగులతో మహ్మదుల్లా సత్తా చాటాడు. లిట్టన్ దాస్ కూడా రెండు అర్ధసెంచరీలు చేసినా భారీ స్కోర్లు చేయడం లేదు. వీరిద్దరి నుంచి బంగ్లా మరోసారి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. బౌలింగ్‌లో కూడా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ పర్వాలేదనిపిస్తున్నారు. ధర్మశాలలో దక్షిణాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్ ఈ మ్యాచ్‌లో బంగ్లాపై గెలిచి తమ విజయం గాలి వాటం కాదని నిరూపించాలని భావిస్తోంది.
నెదర్వాండ్స్ చివరి రెండు మ్యాచుల్లో శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. ఆస్ట్రేలియాపై 400 పరుగుల భారీ ఛేదనలో డచ్ జట్టు 90 పరుగులకే కుప్పకూలి 309 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
బంగ్లాదేశ్ జట్లు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిదీ హసన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం.
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ ( కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, వెస్లీ బరేసి, బాస్ డి లీడే, ఆర్యన్ దత్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, మాక్స్ ఓ'డౌడ్, షరీజ్ అహ్మద్, లోగాన్ వాన్ బెక్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, విక్రమ్‌జిత్ సింగ్.