Shubman Gill ODI Captaincy: కెప్టెన్సీ తో గిల్ ను ప్రెషర్ చేస్తున్నారు.. ఆ తర్వాత ఇస్తే బాగుండేది.. తనపై భారం పడుతోంది.. మాజీ ప్లేయర్ అసహనం..
ఇంగ్లాండ్ టూర్లో టెస్టులకు కెప్టెన్ గా గిల్ ఎంపిక కాగా, తాజాగా ఆసీస్ టూర్ కు తనను వన్డే కెప్టెన్ గా నియమించారు. ఆసియాకప్ లో తను టీ20 జట్టు వైస్ కెప్టెన్ గాను వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Ind VS Aus Odi Series Updates : భారత వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి, శుభమాన్ గిల్ కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గిల్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్ గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే తక్కువ సమయంలో ఒకేసారి ఇన్ని బాధ్యతలు చేపట్టడం సరికాదని మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. నిజానికి వన్డే పగ్గాలు చేపట్టడంపై గిల్ అయిష్టంగా ఉన్నప్పటికీ, ఫోర్స్ చేసి అతనికి కెప్టెన్సీ ఇచ్చారని తాజాగా తను బాంబ్ పేల్చాడు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారశైలిపై కామెంట్లు, పోస్టులతో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు.
ప్రెషర్ పెడుతున్నారు..
చాలా తక్కువ సమయంలో గిల్ లాంటి ప్రతిభావంతుడిపై అనేక బాధ్యతలు మోపుతున్నారని సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ ను కైఫ్ విమర్శించాడు. టెస్టు కెప్టెన్ వరకు ఫర్వాలేదని, తాజాగా ఆసియాకప్ లో టీ20 వైస్ కెప్టెన్ గా నూ గిల్ ను ఎంపిక చేశారని, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వైదొలిగితే, తనే పగ్గాలు చేపడతాడని, అలాంటి సమయంలో ఇంత హడావిడిగా గిల్ ను కెప్టెన్సీకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు వేచి చూసి, అనుభవం పంపాదించాక, అప్పుడు పగ్గాలు అప్పగిస్తే బాగుండేదని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా సెలెక్టర్లు కాస్త దుందుడుకు నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించాడు.
రోహిత్ కి చెక్..
నిజానికి ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి భారత క్రికెట్లో రోహిత్ పేరు నానుతూనే ఉంది. ఆరంభంలో టెస్టు జట్టుకు వీడ్కోలు పలుకగా, గిల్ ను ఇంగ్లాండ్ టూర్ కు సారథిగా ఎంపిక చేశారు. అంతకుముందు 2024లో టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. ఈ సందర్భంగా రోహిత్.. పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్ పర్యటన నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించి, గిల్ కు పగ్గాలు అప్పగించారు. ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు తను కేవలం బ్యాటర్ గా మాత్రమే జట్టులో ఆడనున్నాడు. 38వ పడిలో ఉండటంతో త్వరలోనే తన కెరీర్ ముగిసినట్లేనని తాజాగా చర్చ జరుగుతోంది. ఇక ఈ టూర్ లో ఆసీస్ తో ఇండియా మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీ భవితవ్యంపై ఒక స్పష్టత రానుంది.




















