లెజెండ్స్ లీగ్ క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది
దిగ్గజాల మధ్య పోరును క్రికెట్ ప్రేమికులకు చూపించేందుకు లెజెండ్ లీగ్ క్రికెట్ సిద్ధమైంది. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే ఈ లీగ్ లో.. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు పాల్గొననున్నారు.
క్రికెట్ ప్రియులకు శుభవార్త. రిటైరైన దిగ్గజాల ఆటను మళ్లీ మనకు చూపించేందుకు లెజెండ్ లీగ్ క్రికెట్-2022 మన ముందుకు రాబోతోంది. ఈ సీజన్ కోసం నిర్వాహకులు షెడ్యూలును ప్రకటించారు. మ్యాచ్ లు జరిగే వేదికలను ఖరారు చేశారు. 2022 సెప్టెంబర్, 16 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా.. కోల్ కతా లోని ఈడెన్ గార్డ్సెన్స్ లో ఇండియా మహారాజాస్-వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రత్యేక మ్యాచ్ తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. భారత జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించనుండగా.. ప్రపంచ టీంకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ చేయనున్నాడు.
మొత్తం ఆరు నగరాలు
సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు జరిగే 3 మ్యాచ్ లకు కోల్ కతా ఆతిథ్యమివ్వనుంది. దీంతోపాటు న్యూదిల్లీ, కటక్, లఖ్ నవూ, జోధ్ పూర్ లలో మ్యాచులు జరగనున్నాయి. జోధ్ పూర్, లఖ్ నవూ మినహా మిగిలిన వాటిల్లో మూడేసి గేములు నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్, ఫైనల్ కోసం వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.
ఈ సందర్భంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి మాట్లాడారు. అద్భుతమైన మైదానాలలో క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసేందుకు వస్తున్నామని తెలిపారు. దిగ్గజ లెజెండరీ ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఫైనల్ డెహ్రాడూన్ లో!
ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ ను డెహ్రాడూన్ లో నిర్వహించేందుకు చూస్తున్నామని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా తెలిపారు. మ్యాచుల షెడ్యూల్ ను విడుదల చేశామని.. దిగ్గజాల ఆటను వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలన్నారు. దాదాపు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటారని చెప్పారు.
పాకిస్థాన్ నుంచి ఎవరూ పాల్గొనడం లేదని చెప్పారు. త్వరలో మరికొంతమందిని లీగ్ లో చేరుస్తామని వివరించారు. ఈ టోర్నమెంట్ లో 4 జట్లు మొత్తం 15 మ్యాచ్ లు ఆడతాయని వెల్లడించారు. దిగ్గజ ఆటగాళ్లు ప్రతి మ్యాచ్ ఆడేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కొత్త ఫార్మాట్ అభిమానులను మెప్పిస్తుందని చెప్పారు. ఆన్ లైన్ లో టికెట్లకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని రామన్ రహేజా అన్నారు.
మ్యాచ్ ల వివరాలు
కోల్ కతా సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు
లఖ్ నవూ సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు
న్యూదిల్లీ సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు
కటక్ సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు
జోధ్ పూర్ అక్టోబర్ 1 నుంచి 3 వరకు
ప్లేఆఫ్స్ అక్టోబర్ 5 మరియు 7 (వేదిక ఖరారు చేయలేదు)
ఫైనల్ అక్టోబర్ 8 (వేదిక ఖరారు చేయలేదు)