ICC Test Team: ఐసీసీ టెస్ట్ జట్టులో టీమిండియా స్పిన్నర్లకు చోటు
ICC Test Team Of The Year 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పురుషుల 'టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ను ప్రకటించింది. నిరుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా రాణించిన 11 మందిని ఎంపిక చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023(Test Team Of The Year) ను ప్రకటించింది. గతేడాది సత్తాచాటిన ఆటగాళ్లను జట్టుగా ఐసీసీ ఎంపిక చేస్తూ టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20, వన్డే జట్టులను వెల్లడించిన ఐసీసీ తాజాగా టెస్టు జట్టును ప్రకటించింది. నిరుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా రాణించిన 11 మందిని ఎంపిక చేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) 2023 ఫైనల్లో ఆడిన భారత్, ఆస్ట్రేలియా జట్ల నుంచి ఏడుగురుని ఐసీసీ సెలెక్ట్ చేసింది. ప్యాట్ కమిన్స్(Pat Cummins) కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురు చోటు దక్కించుకోగా.. టీమిండియా నుంచి ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఎంపికయ్యారు. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక జట్టు నుంచి ఒక్కరు ఈ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో స్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్టు టీమ్‌లో వరుసగా మూడు సార్లు చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2023తో పాటు 2021, 2022 ఏడాది క్యాలెండర్ ప్రదర్శన ఆధారంగా ప్రకటించిన జట్టులో అశ్విన్ ఉన్నాడు.
టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ : ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్.