(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2023: 'హోమ్ అండ్ ఎవే' ఫార్మాట్ లో ఐపీఎల్- 2023.. స్పష్టం చేసిన బీసీసీఐ చీఫ్
IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ ను 'హోమ్ అండ్ ఎవే' ఫార్మాట్ లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు. కరోనా కారణంగా గత 3 సీజన్లు ఈ ఫార్మాట్ లో జరగలేదు.
IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ పాత ఫార్మాట్ లో జరగనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. 3 సీజన్ల తర్వాత ఐపీఎల్ 16వ ఎడిషన్ ను హోమ్ అండ్ ఎవే ఫార్మాట్లో నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని గంగూలీ ఆయా రాష్ట్ర అనుబంధ ఫ్రాంచైజీలకు తెలియజేశారు. ఐపీఎల్ 2023 సీజన్ షెడ్యూల్ ను తర్వాతి చర్చల్లో నిర్ణయించనున్నారు.
కొన్ని వేదికల్లోనే
కరోనా వ్యాప్తి కారణంగా 2020 నుంచి ఐపీఎల్ మ్యాచులను కొన్ని వేదికలలోనే నిర్వహిస్తున్నారు. ఆ సంవత్సరం దుబాయ్, షార్జా, అబుదాబిలలో మ్యాచులు జరిగాయి. 2021 లో సగభాగం భారత్ లోనే నిర్వహించినప్పటికీ.. కేవలం 4 వేదికల్లోనే మ్యాచ్ లు జరిగాయి. దిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నైలో లీగ్ జరిగింది. అయితే రెండో దశ ఐపీఎల్ మ్యాచులు యూఏఈలోనే నిర్వహించారు.
హోమ్ అండ్ ఎవే
ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి నియంత్రణలో ఉన్నందున ఐపీఎల్ ఫార్మాట్ ను తిరిగి పాత పద్ధతిలో జరపనున్నారు. పాత పద్ధతిలో ప్రతి జట్టు హోమ్ గ్రౌండ్ లో ఒక మ్యాచ్, ఎవే గ్రౌండ్ లో ఒక మ్యాచ్ ఆడుతుంది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ రాసిన నోట్ ను రాష్ట్ర ఫ్రాంచైజీలకు పంపించారు. 2020 తర్వాత బీసీసీఐ మొదటిసారిగా పూర్తిస్థాయి దేశీయ సీజన్ ను నిర్వహిస్తోంది.
వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్
వచ్చే ఏడాది ఆరంభంలో మహిళల ఐపీఎల్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ పనిచేస్తున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ తర్వాత మార్చిలో మహిళల ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ గత నెలలో నివేదించింది.
అండర్- 15 వన్డే టోర్నమెంట్
'బీసీసీఐ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్ కోసం పని చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మొదటి సీజన్‌ను ప్రారంభించాలని మేము భావిస్తున్నాం' అని గంగూలీ సెప్టెంబర్ 20 నాటి లేఖలో రాశారు. మహిళల ఐపీఎల్ భారతదేశంలో మహిళల క్రికెట్ స్థాయిని పెంచుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు బీసీసీఐ బాలికల అండర్-15 వన్డే టోర్నమెంట్‌ను ప్రారంభిస్తోంది.
ఇది వారికి మంచి అవకాశం
'ఈ సీజన్ నుంచి బాలికల అండర్- 15 వన్డే టోర్నమెంట్ ను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. మన జాతీయ జట్టు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ కొత్త టోర్నీ మన యువతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు ఒక మార్గాన్ని సృష్టిస్తుంది' అని గంగూలీ పేర్కొన్నారు.
బెంగళూరు, రాంచీ, రాజ్‌కోట్, ఇండోర్, రాయ్‌పూర్, పుణె వేదికల్లో డిసెంబర్ 26 నుంచి జనవరి 12 వరకు మహిళల అండర్- 15 తొలి టోర్నీ జరగబోతోంది.
JUST IN:
Further progress and details on Women's IPL will follow - Sourav Ganguly wrote in his email to state associations#CricketTwitter #HarmanpreetKaur pic.twitter.com/I8mMRkM5sn
— Female Cricket (@imfemalecricket) September 22, 2022