RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
ఐపీఎల్ 2022 సీజన్‌లో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివర్లో తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాణించిన రజత్ పాటీదార్ (58: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఈసారి కూడా టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ రాయల్స్ విజయానికి 120 బంతుల్లో 158 పరుగులు కావాలి. చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాటింగ్ పేలవంగా ప్రారంభం అయింది. విరాట్ కోహ్లీ మరోసారి విఫలం అయ్యాడు. అయితే మరో ఓపెనర్ రజత్ పాటీదార్, కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రజత్ పాటీదార్ వేగంగా ఆడగా... ఫాఫ్ తనకు చక్కటి సహకారం అందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో ఫాఫ్ అవుటయ్యాడు.
డుఫ్లెసిస్ వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ ఉన్నంత సేపు మెరుపులు మెరిపించినా... ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. అర్థ సెంచరీ తర్వాత రజత్ పాటీదార్ కూడా అవుటయ్యాడు. ఈ రెండు వికెట్ల తర్వాత ఆర్సీబీ కోలుకోలేకపోయింది. దినేష్ కార్తీక్‌ను ప్రసీద్ కృష్ణ ఎక్కువ సేపు క్రీజులో ఉండనివ్వలేదు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్ మూడేసి వికెట్లు తీయగా... ట్రెంట్ బౌల్ట్, అశ్విన్‌లకు చెరో వికెట్ దక్కింది.
View this post on Instagram