INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?
శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
ఆసియా కప్‌లో శ్రీలంకతో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓ మోస్తరు స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. శ్రీలంక విజయానికి 20 ఓవర్లలో 151 పరుగులు అవసరం. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్జ్ (76: 53 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ల వికెట్లను చాలా త్వరగా కోల్పోయింది. కేవలం 23 పరుగులకే స్మృతి మంథన (6: 7 బంతుల్లో, ఒక ఫోర్), షెఫాలీ వర్మ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అనంతరం జెమీమా రోడ్రిగ్జ్ (76: 53 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), హర్మన్ ప్రీత్ కౌర్ (33: 30 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు.
అయితే కీలక సమయంలో క్రీజులో కుదురుకున్న వీరిద్దరూ అవుట్ కావడం టీమిండియాను దెబ్బ తీసింది. దీంతో స్లాగ్ ఓవర్లలో స్కోరు వేగం తగ్గిపోయింది. ఒకదశలో 170 నుంచి 180కు వెళ్తుందనుకున్న స్కోరు 150 వద్దే ఆగిపోయింది. శ్రీలంక బౌలర్లలో ఒషాది రణసింఘే మూడు వికెట్లు తీయగా, సుగందిక కుమారి, ఆటపట్టు చెరో వికెట్ తీసుకున్నారు.
View this post on Instagram
View this post on Instagram