Viral Video: వై నాట్ హిమ్..? అతడిని బీజీటీలో ఎందుకు ఆడించలేదని బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Indian Fans Fires On BCCI: పదేళ్ల తర్వాత బీజీటీలో భారత్ ఓడిపోయింది. ఆసీస్ టూర్లో భాగంగా ఐదు టెస్టులాడిన ఇండియా.. 1-3తో సిరీస్ చేజార్చుకుంది. సరైన జట్టు లైనప్ లేని కారణంగా టీమ్ ఓడిందనే విమర్శలున్నాయి.
Arshdeep Singh News: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఒక వైపు బ్యాటర్ల వైఫ్యలం కొంపముంచగా, బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా వేరే పేసర్ సహాకారం అందించలేదని విమర్శులు ఉన్నాయి. ఆ సిరీస్ లో 32 వికెట్లు తీసిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. అయితే మిగతా పేసర్ల నుంచి అతనికి సహకారం దక్కలేదు. అయితే గతంలో కౌంట్ చాంపియన్షిప్ లో ఆడిన అర్షదీప్ సింగ్ పాత వీడియోను భారత అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో చక్కని ఇన్ స్వింగర్ తో అభిమానుల మనసు దోచుకున్నాడు. అర్షదీప్ స్వింగ్ దాటికి ప్రత్యర్థి బ్యాటర్ నుంచి సమాధానమే లేకుండా పోయింది. ఈ డెలివరీకి సంబంధించిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడిని బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఎందుకు ఆడించలేదని పలువురు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అతడుంటే లెక్క వేరే ఉండేదని ఆక్రోషిస్తున్నారు.
Beautiful swing from Arshdeep Singh pic.twitter.com/hhFX2WzHlz
— Rothesay County Championship (@CountyChamp) January 7, 2025
ఇన్ స్వింగర్ తో బెంబేలు..
ఇక కౌంటీల్లో అర్షదీప్ సింగ్ కెంట్ జట్టు తరపున గతంలో ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా జరిగిన ఒక మ్యాచ్ లో తను వేసిన బంతి ఇన్ స్వింగ్ అయి బ్యాటర్ వికెట్లను గిరాటేసింది. ముఖ్యంగా బ్యాటర్ డిఫెన్స్ ఆడినా, అతడి డిఫెన్స్ ను ఛేదించుకుని మరీ బంతి వికెట్లను ముద్దాడింది. చూడటానికి చాలా చక్కగా ఉన్న బౌలింగ్ ను చూసి భారత అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ లో వరుసగా రెండుసార్లు ఆడిన అర్షదీప్ ను ఎందుకని టెస్టుల్లో ఆడించడం లేదని బీసీసీఐని పలువురు ప్రశ్నిస్తున్నారు. జట్టులో ఎడమ చేతి వాటం సీమర్లు లేరని, ఈ క్రమంలో ఆసీసీ్ కు అర్షదీప్ వెళ్లినట్లయితే జట్టుకు ఎంతో ఉపయోగం ఉండి ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. అతడిని మూడు ఫార్మాట్లలో ఆడించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గత టీ20 ప్రపంచకప్ లో అతను లీడింగ్ వికెట్ టేకర్ గా కూడా నిలిచాడు.
జట్టు ప్రణాళిక లోపాలు..
నిజానికి జట్టులో లెఫ్టార్మ్ సీమర్ ఉండాలని మాజీలు, విశ్లేషకులు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా టీమిండియా మేనేజ్మెంట్ ఖాతరు చేయలేదు. ఆసీస్ బ్యాటర్లు లెఫ్టార్మ్ సీమర్లకు తడబడతారని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో తగిన మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా లెఫ్టార్మ్ పేసర్లకు వికెట్ సమర్పించుకునే ట్రావిస్ హెడ్ సిరీస్ లో రెండు సెంచరీలు బాది జట్టు కొంప ముంచాడు. అలాగే జట్టుతో పాటు టూర్ కి వెళ్లిన లెఫ్టార్మ్ పేసర్ ను టీమ్ లోకి తీసుకోకుండా, విజయ్ హజారే టోర్నీ కోసం రిలీజ్ చేయడొం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎండ్ ఆఫ్ ద డే.. అటు బీజీటీని కోల్పోయిన భారత్.. ఇటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి ఔటై అభిమానులను ఉస్సురుమనిపించింది. ఇప్పటికైనా జట్టు ప్రణాళికలు సమర్థంగా ఉంటేనే టీమ్ విజయవంతమవుతుందని పలువురు చురకలు అంటిస్తున్నారు. రాబోయే టోర్నీలోనైనా జట్టు కూర్పుపై సరిగ్గా కసరత్తు చేయాలని సూచిస్తున్నారు.
Also Read: Kohli News: బ్యాక్ టూ బేసిక్స్.. రోహిత్, కోహ్లీకి కర్తవ్యాన్ని బోధించిన మాజీ కోచ్