Kohli News: బ్యాక్ టూ బేసిక్స్.. రోహిత్, కోహ్లీకి కర్తవ్యాన్ని బోధించిన మాజీ కోచ్
ఇటీవల జరిగిన ఆసీస్ టూర్లో సీనియర్లు రోహిత్, కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. మూడు టెస్టులాడిన రోహిత్ కేవలం 31 పరుగులు చేయగా, ఐదు టెస్టులాడిన కోహ్లీ కేవలం 190 పరుగులు మాత్రామే చేశాడు.
Rohit Sharma News: టెస్టుల్లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2024 టెస్టులకు సంబంధించి పీడకలగా మారింది. రోహిత్ ఇయర్ ప్రారంభంలో ఇంగ్లాండ్ సిరీస్ తో రాణించినా, తర్వాత దశలో ఫెయిలయ్యాడు. ఏకంగా సిడ్నీ టెస్టులో విశ్రాంతి పేరుతో జట్టులో చోటే కోల్పోయాడు. ఇక కోహ్లీది మర కథ. పదే పదే ఒకేరకంగా ఔటవుతూ అభిమానులకు కూడా చిరాకు తెప్పిస్తున్నాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. టెస్టు ఫార్మాట్లో ఆడటం సందిగ్ధంలో పడిన స్థితిలో రిటైర్మెంట్ నిర్ణయం వాళ్ల చేతుల్లోనే ఉందని భారత మాజీ కోచ్ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. లాంగెస్ట్ ఫార్మాట్లో కొనసాగాలనుకుంటే బ్యాక్ టూ బేసిక్స్ మాదిరిగా దేశవాళీల్లో ఆడక తప్పదని పేర్కొన్నాడు.
స్పిన్ కు దాసోహం..
ఒకప్పుడు స్పిన్నర్ల భారత ఆటగాళ్లు అలవోకగా ఎదుర్కొనేవాళ్లు. కళాత్మక డ్రైవ్ లతో చూసే ప్రేక్షకులకు కనువిందు చేసేవారు. అయితే ప్రజెంట్ జనరేషన్లో అలాంటి క్రికెటర్ల్ కాగడా పెట్టి వెతికినా కనబడరు. పైగా, ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉంటే వికెట్టు చేతికి అప్పనంగా అప్పగిస్తున్నారు. రోహిత్, కోహ్లీ కూడా వీరికి మినహాయింపు కాదు. అందుకే దేశవాళీల్లో ఆడితే స్పిన్నర్లను మరింత ఎఫెక్టివ్ గా ఎదుర్కోవచ్చనేది శాస్త్రి వాదన. ప్రజెంట్ జనరేషన్లోని స్పిన్నర్లను ఎదుర్కోవడం ద్వారా మళ్లీ టచ్ లోకి రావచ్చని సూచించాడు.
ఇక దేశవాళీల్లో భారత ఆటగాళ్లు ఆడాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా సూచించాడు. ఈనెలలో ప్రారంభమయ్యే మలి దశ రంజీ ట్రోఫీలో ఎవరైతే ఆడరో, అలాంటి వారిపై నిర్ధాక్షిణ్యంగా వేటు వేయాలని పేర్కొన్నాడు. ఇక చివరగా 2016లో రోహిత్, 2012లో కోహ్లీ దేశవాళీ క్రికెట్లో ఆడారు. ఇక అప్పటి నుంచి దేశవాళీల్లో గతంలోనూ విమర్శలు వచ్చినా వాళ్లు ఖాతరు చేయలేదు. అయితే ఈసారి మాత్రం చావోరేవో లాంటి పొజిషన్లో ఉండటంతో ఈసారి డొమెస్టిక్ లో ఆడే అవకాశముందని పలువురు అభివర్ణిస్తున్నారు.
ఆ ప్రయోజనాలు గ్యారెంటీ..
డొమెస్టిక్ క్రికెట్లో ఆడటం ద్వారా సీనియర్లకు రెండు రకాల ప్రయోజానలు చేకూరుతాయని శాస్త్రి పేర్కొన్నాడు. కొత్త తరం ఆటగాళ్లతో ఆడటం ద్వారా తమను తాము అప్డేట్ చేసుకోవచ్చని, నయాతరం బౌలర్లను ఎదుర్కోవడం ద్వారా టెక్నిక్ ను కూడా సరిచేసుకోవచ్చని సూచించాడు. అలాగే తమ అనుభవాల ద్వారా యువ క్రికెటర్లకు మార్గదర్శకం వహించవచ్చని, వారి కెరీర్ కు సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా నాణ్యమైన ఆటగాళ్లను రూపొందించవచ్చని అభివర్ణించాడు. ఏదేమైనా ఈసారి సీనియర్లపై బీసీసీఐ కఠినంగానే ఉంది. డొమెస్టిక్ క్రికెట్లో ఆడని వారిపై వేటు వేసిన ఆశ్చర్య పోనవసరం లేదని సమాచారం. 2027 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కోసం ఇప్పటి నుంచే జట్టును రూపొందించే ప్లాన్ లో ఉంది. మరి అందుకోసం 36 ఏళ్ల కోహ్లీ, 37 ఏళ్ల రోహిత్ సిద్ధమవుతారో లేదో చూడాలి.