Gambhir Clarification: డ్రెస్సింగ్ రూంలో వివాదాలపై స్పందించిన గంభీర్.. సిడ్నీ టెస్టుకి రోహిత్ డౌటే!.. గతంలో ఈ వివాదంపై ధోనీ సెటైర్లు
గతంలో కూడా భారత డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనను అభిమానులు నెమరేసుకుంటున్నారు.
Indian Dressing Room Rows: గతవారం మెల్ బోర్న్ లో జరిగిన నాలుగో టెస్టులో భారత పరాజయం తర్వాత డ్రెస్సింగ్ రూం వాతావరణం వేడెక్కినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈజీగా డ్రా కావాల్సిన గేమ్ ను చేజేతులా పోగొట్టుకోవడంపై భారత కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాన ఆటగాళ్లపై మండిపడినట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో గానీ, 2014లో జరిగిన బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో కూడా ఇలాంటి వదంతులే వ్యాపించాయి. వాటిని గుర్తు చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అప్పట్లో ఈ వివాదంపై ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నకు అప్పటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన దైన శైలిలో జవాబిచ్చాడు.
ధావన్ ను కోహ్లీ కత్తితో పొడిచాడు..!
2014 సిరీస్ లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. సిరీస్ ను 0-4తో వైట్ వాష్ గురయి మరీ కోల్పోయింది. ఈక్రమంలో జట్టులోని విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ మధ్య విబేధాలు ఉన్నట్లు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. దీనిపై ధోనిని ప్రశ్నించగా.. వ్యంగంగా బదులిచ్చాడు. అవును ఇద్దరి మధ్య పాత కక్షలున్నాయి. కత్తి తీసుకుని ధావన్ ను కోహ్లి పొడిచాడని, కోలుకున్న తర్వాత ఇప్పుడే బ్యాటింగ్ కు పంపించామంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో ఇలాంటివి జరుగుతున్నట్లు ఎవరూ ఉప్పందిస్తున్నారో వారి పేర్లు కూడా బహిరంగం పర్చాలని సెటైర్ వేశాడు. ఈ కథలతో మార్వెల్, వార్నర్ బ్రదర్స్ సంస్థలు అద్భుతమైన సినిమాలు తీయవచ్చని ఆన్సరిచ్చాడు.
సిడ్నీ టెస్టుకు జట్టులో మార్పులు..!
ఇక సిరీస్ కాపాడుకోవాలంటే సిడ్నీ టెస్టులో భారత్ కు గెలుపు తప్పనిసరి. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే సిరీస్ ను 2-2తో డ్రా చేసుకుంటుంది. గత సిరీస్ లో గెలవడం ద్వారా భారత్ దగ్గరే ట్రోఫీ ఉండటంతో మరోసారి సిరీస్ కూడా భారత్ సొంతమవుతుంది. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు వరుసగా మూడోసారి వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. దీంతో ఈ టెస్టులో గెలుపొందాలని టీమ్ మేనేజ్మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా ఫామ్ లో లేని క్రికేటర్లపై వేటు వేసే చాన్స్ ఉంది. అలాగే గౌతం గంభీర్ కోచింగ్ కొనసాగాలంటే ఈ టెస్టు గెలుపు తప్పనిసరి. మరి ఈ టెస్టుకు భారత్ ఎలాంటి వ్యూహాలతో వస్తుందో చూడాలి. మరోవైపు జట్టులో ఎలాంటి విబేధాలు లేవని, అంతా బాగానే ఉందని గంభీర్ చెప్పుకొచ్చాడు. అలాగే శుక్రవారం పిచ్ ను పరిశీలించిన తర్వాతే తుదిజట్టుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో రోహిత్ స్థానంపై చర్చ మొదలైంది. ఇక స్లిప్పులో క్యాచ్ ల ట్రైనింగ్ సందర్భంగా రోహిత్ కన్పించకపోవడం కూడా సందేహాలకు తావిస్తోంది. అతడిని తప్పిస్తే బుమ్రాకు పగ్గాలు అప్పగించే చాన్స్ ఉంది. అన్ని ప్రశ్నలకు సమాధానం టాస్ వేశాక తెలుస్తుంది.