IND vs SL, Super 4 Preview: నిలవాలంటే గెలవాల్సిందే, నేడు శ్రీలంకతో భారత్ ఢీ
IND vs SL, Super 4 Preview: సూపర్- 4 లో తన రెండో మ్యాచ్ లో నేడు భారత్ శ్రీలంకను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ తలుపులు తెరిచి ఉంటాయి. కాబట్టి లంకపై తప్పక గెలవాల్సిందే.
IND vs SL, Super 4 Preview: రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ ను అందుకుందామని టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా జట్టు.. ప్రస్తుతం చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో శ్రీలంకను ఎదుర్కోబోతోంది. లీగ్ దశలో పాకిస్థాన్, హాంకాంగ్ లను ఓడించి సూపర్- 4కు చేరుకున్న భారత్ కు పాక్ గట్టి షాకిచ్చింది. సూపర్- 4 తొలి మ్యాచ్ లో దాయాది చేతిలో ఓటమితో డీలాపడిన భారత్ కు శ్రీలంకతో మ్యాచ్ గెలవడం తప్పనిసరి. లంకపై గెలిస్తేనే టీమిండియాకు ఫైనల్ దారులు తెరిచి ఉంటాయి. ఈ మ్యాచ్ లో ఓడితే దాదాపు ఇంటికెళ్లడమే.
సూపర్- 4 లో తన రెండో మ్యాచ్ లో నేడు భారత్ శ్రీలంకను ఢీకొనబోతోంది. తొలి మ్యాచ్ లో పాక్ చేతిలో ఓటమితో ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ తలుపులు తెరిచి ఉంటాయి. కాబట్టి లంకపై తప్పక గెలవాల్సిందే. అయితే అదంత తేలికేమీ కాదు.
బ్యాటింగ్ ఓకే.. .. కానీ
పాక్ తో మ్యాచ్ లో ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్ చేశారు. తొలి 6 ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకుని వేగంగా పరుగులు రాబట్టారు. అయితే రోహిత్, రాహుల్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ఫాం అందుకోవడం భారత్ కు కలిసొచ్చే అంశం. ఆడిన 3 మ్యాచ్ ల్లోనూ కోహ్లీ మంచి పరుగులు చేశాడు. అయితే ఇంకా వేగంగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. పాక్ తో మ్యాచ్ లో మిడిలార్డర్ వైఫల్యం కూడా కొంపముంచింది. పంత్, పాండ్య, దీపక్ హుడా పెద్దగా పరుగులు చేయలేదు. ఈ మ్యాచ్ లో కీపర్ రిషబ్ పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ ను తీసుకుంటారేమో చూడాలి.
బౌలింగ్ తీరు మారాలి
బ్యాటింగ్ లో ఫామ్ చూపిస్తున్న భారత్ ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. గాయాలతో బుమ్రా, హర్షల్ పటేల్ టోర్నీకి ముందే దూరమవటంతో బౌలింగ్ విభాగం బలహీనపడింది. జడేజా మధ్యలో గాయపడి అందుబాటులో లేకుండా పోయాడు. అర్హదీప్ బాగానే బౌలింగ్ చేస్తున్నా, అవేష్ ఖాన్ అంతగా రాణించట్లేదు. ప్రధాన స్పిన్నర్ చహాల్ వికెట్లు తీయలేకపోతున్నాడు. గత మ్యాచ్ లో ఆరో బౌలర్ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. హుడా స్పిన్ వేయగలిగినా రోహిత్ అతన్ని ఉపయోగించుకోలేదు. జడేజా స్థానంలో ఎంపికైన అక్షర్ పటేల్ ను ఈరోజు ఆడిస్తారేమో చూడాలి. అతను టీంలోకి వస్తే రవి బిష్ణోయ్ పెవిలియన్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. అలాగే విఫలమవుతున్న చహాల్ స్థానంలో అశ్విన్ ను తీసుకుంటారేమో చూడాలి. ఏదేమైనా బౌలింగ్ విభాగం రాణించకపోతే గెలవడం కష్టమే.
లంక చేతిలో భారత్ ఓడితే పైనల్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. చివరి మ్యాచ్ లో అఫ్గాన్ పై నెగ్గినా చాలా సమీకరణాలు కలిసిరావాలి. కాబట్టి అంతవరకు రాకుండా ఉండాలంటే బలహీనతల్ని అధిగమించి, సమష్టిగా ఆడి శ్రీలంకపై గెలవాలి.
పిచ్ పరిస్థితి
దుబాయ్ పిచ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. మొదట టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కు మొగ్గుచూపొచ్చు.
గత రికార్డు
ఇప్పటివరకూ శ్రీలంక- భారత్ 25 టీ20ల్లో తలపడ్డాయి. అందులో 17 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. ఏడింట్లో లంక విజయం సాధించగా.. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.
భారత్ తుది జట్టు (అంచనా)
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్ దినేశ్ కార్తీక్, పాండ్య, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ రవి బిష్ణోయ్, అర్హదీప్ సింగ్, చహాల్ అశ్విన్.
శ్రీలంక తుది జట్టు (అంచనా)
నిశాంక్, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), హసరంగ, చామిక కరుణరత్నే, తీక్షణ, దిల్షాన్, మదుశంక.
📸📸@imVkohli 👌#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/6aSKHLLA9s
— BCCI (@BCCI) September 4, 2022