Ind vs Eng in 5th Test Day 3 Updates : ఆసక్తికరంగా ఐదో టెస్టు.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్.. ప్రస్తుతం 50/1. భారత్ 396.. జైస్వాల్ సెంచరీ,
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఫలితాన్ని తేల్చే టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 2వ ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు చేసి, ప్రత్యర్థి ముందు భారీటార్గెట్ ఉంచింది.నాలుగోరోజే ఈ టెస్టు ఫలితం తేలే చాన్స్.

Yashasvi Jaiswal Super Century: ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రసకందాయంలో పడింది. శనివారం మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 75/2 తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ 396 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ (164 బంతుల్లో 118, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోష్ టంగ్ ఫైఫర్ తో రాణించాడు. అనంతరం 374 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మూడో రోజు ఆట ముగిసేసరికి 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్ (34 బ్యాటింగ్) ఉండగా, జాక్ క్రాలీ (14)ని మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు.. విజయానికి ఇంకా ఇంగ్లాండ్ 324 పరుగులు చేయాల్సి ఉంది. ఇండియాకు 9 వికెట్లు కావాలి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. అలాగే ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే, 2-2తో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ ను సమం చేస్తుంది. ఏదేమైనా ఆదివారం నాలుగో రోజు ఆటలో ఫలితం తేలే అవకాశం ఉంది.
All to play after Day 3 as the series heads towards a blockbuster finish 🤩#WTC27 | 📝 #ENGvIND: https://t.co/SNl4Ym0LJt pic.twitter.com/yZ9af6JHR3
— ICC (@ICC) August 2, 2025
జైస్వాల్ సెంచరీ..
తొలి టెస్టులో సెంచరీ తర్వాత మళ్లీ ఈ టెస్టులోనే జైస్వాల్ సెంచరీని సాధించాడు. ఓవర్ నైట్ స్కోరు తో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇండియాకు ఊహించని భాగస్వామ్యం లభించింది. ఆకాశ్ దీప్ (66) తో కలిసి మూడో వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జైస్వాల్ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక పార్ట్ నర్ షిప్ కావడం విశేషం. లంచ్ వరకు వేగంగా పరుగులు సాధించిన ఈ జంట.. ఇంగ్లాండ్ కి ముచ్చెమటలు పోయించింది. ముఖ్యంగా ఆకాశ్ దీప్ వేగంగా ఆడుతూ, కెరీర్ లో తొలి అర్ద సెంచరీని సాధించాడు. అయితే లంచ్ విరామానికి ముందు ఆకాశ్ దీప్ ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత శుభమాన్ గిల్ (11), కరుణ్ నాయర్ (17) విఫలమైనా జైస్వాల్ మాత్రం జోరు చూపించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
జడేజా, వాషింగ్టన్ ఫిఫ్టీలు..
జైస్వాల్ తో కలిసి రవీంద్ర జడేజా (53) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో జైస్వాల్ ఔటైనా, జడేజా, చివర్లో వాషింగ్టన్ సుందర్ సూపర్ ఫిఫ్టీ (53)తో సత్తా చాటాడు. ధ్రువ్ జురేల్ (34) కూడా ఆకట్టుకున్నాడు. మిగతా ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ కు మూడు, జామీ ఓవర్టన్ కు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని తీసేయగా.. ఇంగ్లాండ్ కు 374 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. అయితే ఈ ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లాండ్ కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ కలిసి కరెక్టుగా 50 పరుగులు జోడించారు. అయితే ఆట చివరి ఓవర్లో సిరాజ్.. క్రాలీని ఔట్ చేశాడు. దీంతో భారత్ కాస్తా హేపీగా పెవిలియన్ కు వెళ్లింది. చివరి రోజు వీలైనంత త్వరగా టాపార్డర్ వికెట్లు తీస్తే, టీమిండియా ఈ మ్యాచ్ ను సాధించే అవకాశముంది.


















