Eng Thrilling Victory Vs Ind In 3rd Test: పోరాడి ఓడిన భారత్.. ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ.. జడేజా పోరాటం వృథా.. 23 నుంచి 4వ టెస్టు
లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. బౌలర్లు సత్తా చాటడంతో సోమవారం ఒక్కరోజే ఆరు వికెట్లు తీసి, సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. జడేజా ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు.

Ind vs eng 3rd test result update: ఇండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. సోమవారం ఆటకు ఆఖరు రోజు 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ మూడేసి వికెట్లతో సత్తా చాటారు. చివరిరోజు ఆట ప్రారంభం నుంచి వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ, భారత్ పై ఒత్తిడి పడింది. ఈ క్రమంలో సోమవారం ఆరు వికెట్లను కోల్పోయిన ఇండియా.. 22 పరుగులతో పరాజయం పాలైంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి మాంచెస్టర్ లో ప్రారంభమవుతుంది.
100 up in the chase for #TeamIndia!
— BCCI (@BCCI) July 14, 2025
Ravindra Jadeja (14*) and Nitish Kumar Reddy (6*) are in the middle.
Updates ▶️ https://t.co/X4xIDiSmBg #ENGvIND | @imjadeja | @NKReddy07 pic.twitter.com/Bi1fGF4N0s
టపాటపా..
ఓవర్ నైట్ స్కోరు 58/4 తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇండియాకు.. ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. మంచి ఫోర్ కొట్టి జోరు మీదున్న రిషభ్ పంత్ (9)ని ఆర్చర్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కేఎల్ రాహుల్ (39) తో కలిసి జడేజా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే స్టోక్స్ వేసిన బంతి అనూహ్యంగా కట్ అవడంతో, ఎల్బీగా రాహుల్ ఔటయ్యాడు. అలాగే ప్రమోషన్ పొంది ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యి నిరాశ పర్చాడు. ఆ తర్వాత తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (13)తో కలిసి జడేజా చాలా సేపు ఓపికగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ఆత్మ రక్షణతో ఆడి, ఆ తర్వాత ఒక్కో పరుగు దొంగిలిస్తూ, స్కోరు బోర్డును ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ విరామానికి ముందు నితీశ్ ను క్రిస్ వోక్స్ ఔట్ చేశాడు. దీంతో 15 ఓవర్లకు పైగా సాగిన 30 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
End of a thrilling Test match at Lord’s.#TeamIndia fought hard but it’s England who win the 3rd Test by 22 runs.
— BCCI (@BCCI) July 14, 2025
Scorecard ▶️ https://t.co/X4xIDiSUqO#ENGvIND pic.twitter.com/KkLlUXPja7
భళా బుమ్రా, సిరాజ్..
లంచ్ విరామానికి 112/8 తో దాదాపు ఓటమి ముంగిట నిలిచిన జట్టును జస్ ప్రీత్ బుమ్రా (5), మహ్మద్ సిరాజ్ (4)లతో కలిసి జడేజా అద్బుత భాగస్వామ్యాలను నిర్మించాడు. దీంతో ఇంగ్లాండ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తొలుత బుమ్రాతో కలిసి 22 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసిన జడేజా.. ఒక్కో పరుగు జత చేస్తూ, టార్గెట్ ను కరిగించుకుంటూ వచ్చాడు. వీరిద్దరూ చాలా ఓపికగా ఆడటంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు. అయితే తొమ్మిదో వికెట్ కు 35 పరుగులు జోడించాక బుమ్రా.. భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత సిరాజ్ కూడా జడ్డూక అండగా నిలవడంతో భారత గెలుపుపై ఆశలు చిగురించాయి. ఇక విజయానికి 23 పరుగుల దూరంలో ఉన్నప్పుడు, సిరాజ్ డిఫెన్స్ ఆడిన బంతి, నెమ్మదిగా దొర్లుకుంటూ, వికెట్లను గిరాటేయ్యడంతో భారత్ ఓటమి ఖాయమైంది. దీంతో ఇంగ్లాండ్ 22 పరుగులతో విజయం సాధించినట్లయ్యింది. మిగతా బౌలర్లలో బ్రైడెన్ కార్స్ కు రెండేసి వికెట్లు దక్కాయి.




















