Team India: టీమిండియాకు అహంకారం ఎక్కువైంది - అందుకే బొక్క బోర్లా పడింది - విండీస్ దిగ్గజం విమర్శలు
భారత క్రికెట్ జట్టుకు అహంకారం ఎక్కువైందని అందుకు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో బొక్క బోర్లా పడ్డారని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ అన్నాడు.
Team India: ఇటీవలే ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. తుదిపోరులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో నిర్దేశించిన 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ సేన 234 పరుగులకే కుప్పకూలిన నేపథ్యంలో టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తున్నది. తాజాగా వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ ఆండీ రాబర్ట్స్ కూడా భారత జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.
మిడ్ డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్స్ మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్ జట్టుకు అహంకారం పెరిగిపోయింది. అందుకే ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టునూ లెక్కచేయడం లేదు. క్రికెట్‌లో సాంప్రదాయక టెస్టు క్రికెట్ తో పాటు వన్డేలపై కూడా టీమిండియా దృష్టి సారించాలి. టీ20 క్రికెట్‌ను నేను పెద్దగా పట్టించుకోను. అందులో బ్యాట్-బాల్‌కు సమాన పోటీలేదు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు బ్యాటింగ్ బలంపై నేను చాలా ఆశలు పెట్టుకున్నా. ఆస్ట్రేలియా రాణించిన ఈ పిచ్‌పై భారత బ్యాటర్లు కూడా బాగా ఆడతారని నేను ఆశించా. కానీ టీమిండియాలో ఒక్క అజింక్యా రహానే మినహా మిగిలినవారంతా తీవ్ర నిరాశపరిచారు. రహానే ఒక్కడే కాస్త పోరాడాడు. చేతికి గాయమైనా అత్యద్భుత ప్రదర్శన కనబరిచాడు. శుభ్‌మన్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడినా అతడు ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. లెగ్ స్టంప్‌కు సమాంతరంగా నిల్చున్న అతడు.. వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ అయితే మరోసారి నిరాశపరిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ వేసిన బంతికి అతడి వద్ద సమాధానమే లేకుండా పోయింది. టీమిండియాలో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ వారిలో ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు..’అని చెప్పాడు.
Congratulations, Australia! 🇦🇺
— ICC (@ICC) June 11, 2023
A roaring victory in the ICC World Test Championship 2023 Final 🎉#WTC23 | #AUSvIND pic.twitter.com/VE01bWheMQ
ఆస్ట్రేలియాతో ఫైనల్ లో భారత జట్టుపై తాను పెద్దగా ఆశలుపెట్టుకోలేదని.. టీమిండియా కుప్పకూలుతుందని తాను ముందుగానే ఊహించానని చెప్పాడు. ‘వాస్తవానికి ఈ మ్యాచ్ లో భారత్ ఏదో అద్భుతం చేస్తుందని నేనైతే ఆశలు పెట్టుకోలేదు. వాళ్లు కుప్పకూలిపోతారని నాకు తెలుసు. రెండు ఇన్నింగ్స్ లలో కూడా టీమిండియా పేలవ బ్యాటింగ్ ప్రదర్శించింది..’ అని రాబర్ట్స్ వ్యాఖ్యానించాడు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను సొంతం చేసుకొనేందుకు రెండో ఇన్నింగ్స్ లో 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ (49), అజింక్య రహానే (46), రోహిత్ శర్మ (43) టాప్ స్కోరర్లు. పుజారా (27) మరోసారి విఫలమయ్యాడు. గిల్ (18) వివాదాస్పద క్యాచ్ తో ఔట్ అయ్యాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ - 121.3 ఓవర్లకు 469 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ - 69.4 ఓవర్లకు 296 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ - 270/8 డిక్లేర్
భారత్ రెండో ఇన్నింగ్స్ - 63.3 ఓవర్లకు 234 ఆలౌట్