Rohit Sharma: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కడే
Rohit Sharma: అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయంతో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది.
పొట్టి క్రికెట్‌లో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్న హిట్‌మ్యాన్.. అఫ్గాన్(Afghan)తో మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నిన్న అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్(Rohit Sharma) ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో గెలిచి... అంతర్జాతీయ స్థాయిలో ఒక జట్టు తరఫున వంద మ్యాచ్‌లలో గెలిచిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కుతాడు. 36 ఏళ్ల రోహిత్.. ఇప్పటివరకూ భారత్ తరఫున 100 మ్యాచ్‌ల విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ ఇన్ని మ్యాచ్‌లలో గెలిచిన సందర్భాలు లేవు. పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షోయభ్ మాలిక్.. 86 మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో ఉండగా... టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 73 విజయాలలో భాగస్వామిగా ఉన్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌తో పాటు అఫ్గానిస్తాన్ మాజీ సారథి మహ్మద్ నబీలు 70 విజయాలలో భాగస్వాములుగా ఉన్నారు.
రోహిత్ పరుగుల ప్రవాహం
భారత్ తరఫున 100 విజయాలలో భాగస్వామిగా ఉన్న రోహిత్.. 100 మ్యాచ్‌లలో 3,039 పరుగులు చేశాడు. ఇందులో 25 అర్థ సెంచరీలూ ఉన్నాయి. రోహిత్ సగటు 37.98 కాగా స్ట్రైక్ రేట్ 142.60గా ఉంది. అంతర్జాతీయ టీ20లలో ఇప్పటివరకూ 148 మ్యాచ్‌లు ఆడి 140 ఇన్నింగ్స్‌లలో 3,853 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 29 అర్థ సెంచరీలున్నాయి. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా కేవలం 52 మ్యాచ్‌ల్లోనే 40 విజయాలు సాధించింది.
మ్యాచ్ విషయానికొస్తే..
అఫ్గానిస్థాన్( Afghanistan)తో జరిగిన తొలి టీ 20లో భారత్(Bharat) ఘన విజయం సాధించింది. తొలుత అఫ్గాన్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్... నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 11 బంతులు మిగిలి ఉండగానే రోహిత్ సేన విజయం సాధించింది.
దూబే అర్ధ శతకం
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్లోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. 14 నెలల తర్వాత టీ 20ల్లో బరిలోకి దిగిన సారధి రోహిత్ శర్మ.. ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. సమన్వయ లోపం కారణంగా రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒక్క పరుగు చేయకుండానే.. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరకుండానే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. కానీ శుభమన్ గిల్, తిలక్ వర్మ భారత్‌ను ఆదుకున్నారు. ఉన్నంత సేపు గిల్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 12 బంతుల్లో అయిదు ఫోర్లతో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 26 పరుగులు చేశాడు. భారత్ విజయం దిశగా సాగుతున్న సమయంలో మరో రెండు వికెట్లు నేలకూలాయి. కానీ శివమ్ దూబే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేవలం 40 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సులతో దూబే 60 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాకు విజయాన్ని అందించాడు.